Shakti Dubey : మనదేశంలో ఐఐటి జేఈఈ అడ్వాన్స్, మెయిన్స్, నీట్ పరీక్షలు అత్యంత కఠినమైనవిగా పేరుపొందాయి. అయితే వాటికి కొన్ని వందల రెట్లు కఠినమైన పరీక్షగా సివిల్స్ పేరు పొందింది. సివిల్స్ పరీక్ష రాయడం అంత సులభం కాదు. అందులో ఉత్తీర్ణత సాధించడం ఆషామాషి వ్యవహారం కాదు.. సివిల్స్ కోసం ఆహోరాత్రాలు శ్రమించి చదివే వారు చాలామంది ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఢిల్లీలో కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ, సంవత్సరాలకు సంవత్సరాలు అక్కడే ఉండి చదివే వారు చాలామంది ఉంటారు. ఇందులో కొంతమంది మాత్రమే విజయవంతం అవుతారు. 2024 లో విడుదలైన నోటిఫికేషన్ కు సంబంధించి మంగళవారం ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో దేశంలోనే ఫస్ట్ ర్యాంకర్ గా శక్తి దూబే నిలిచారు. దేశంలోనే టాప్ ర్యాంకర్ కావడంతో ఒక్కసారిగా శక్తి గురించి చర్చ మొదలైంది. అయితే ఈమె గురించి సెర్చ్ చేస్తే అనేక విషయాలు తెలిశాయి.. సివిల్స్ ను ఎంచుకున్న తీరు.. అందులో ఆమె టాపర్ అయిన తీరు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ సొంత రాష్ట్రం
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ ప్రాంతానికి చెందిన శక్తి.. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి బయో కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పట్టా సాధించారు. 2018 నుంచి ఆమె సివిల్స్ యజ్ఞంలో తలమునకలయ్యారు. దాదాపు ఏడు సంవత్సరాలకు ఆమె సివిల్స్ కు ఎంపికయ్యారు. దేశంలోనే టాపర్ కావడంతో ఏడు సంవత్సరాల ఆమె శ్రమకు సార్థకత లభించినట్లు అయింది. అయితే శక్తి మొదటి ర్యాంకు సాధించగా.. హర్షిత గోయల్ రెండవ ర్యాంకు దక్కించుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. సాయి శివాని 11వ ర్యాంకు.. బన్నా వెంకటేష్ 15వ ర్యాంక్ సాధించారు. శక్తి సివిల్స్ లో ఆప్షనల్స్ గా పొలిటికల్ సైన్స్, అంతర్జాతీయ వ్యవహారాలను తీసుకున్నారు.. కేవలం పుస్తకాలు మాత్రమే కాకుండా.. యూట్యూబ్లో సివిల్స్ విజేతల మనోగతాలను కూడా శక్తి పరిశీలించేవారు. జాతీయ దినపత్రికలను ప్రతి రోజు చదివే వారు. ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకునేవారు. తద్వారా సొంతంగా నోట్స్ రూపొందించుకొని.. ఆ దిశగా ప్రిపేర్ అయ్యేవారు. చాలామంది సివిల్స్ ను కొరకరాని కొయ్యగా భావిస్తుంటారు. కానీ శక్తి అలాకాకుండా.. అత్యంత ఈజీగానే తీసుకున్నారు. పలు సందర్భాల్లో విఫలమైనప్పటికీ.. మళ్లీ సివిల్స్ విజేతగా నిలిచారు. చాలామంది సివిల్స్ యజ్ఞాన్ని మధ్యలోనే వదిలేస్తారు. కాని శక్తి అలా చేయకుండా.. తుది వరకు ప్రయత్నించి విజయం సాధించారు. తద్వారా సివిల్స్ ఎవరైనా రాయొచ్చని.. ఎవరైనా సాధించవచ్చని నిరూపించారు. శక్తి కి సివిల్స్ రాసే క్రమంలో కొన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ.. వాటిని ఆమె విజయ సోపానాలుగా మలుచుకుంది. తద్వారా సివిల్స్ విజేత అయింది.
Also Read : సివిల్స్ ఫలితాలు విడుదల.. తెలుగు అభ్యర్థులు ఎన్ని ర్యాంకులు సాధించారంటే?