కరోనా వైరస్ కట్టడికి ముందుండి ప్రశంసనీయమైన కృషి చేస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలపై దేశంలో పలు చోట్ల దాడులు జరుగుతున్న దృష్ట్యా, వాటి కట్టడికి కేంద్ర ప్రభుత్వం నేడు కఠినమైన చట్టం తీసుకు వచ్చింది. అటువంటి దాడులు జరిపే వారికి 6 నెలల నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే విధంగా ఆర్డినెన్సు తీసుకువచ్చారు.
1897 ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్‌కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. డాక్టర్లపై దాడి చేస్తే ఇక నుంచి దాన్ని నేరంగా పరిగణిస్తారు. కేవలం 30 రోజుల్లోనే విచారణ పూర్తి చేస్తారు. దోషిగా తేలిన వ్యక్తికి మూడు నెలల నుంచి అయిదేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. నిందితులకు 50వేల నుంచి 2 లక్షల వరకు జరిమానా కూడా విధించనున్నారు.
ఒకవేళ చాలా తీవ్రమైన దాడి జరిగితే, దానికి మరో విధమైన శిక్షను అమలు చేయనున్నారు. దాడి తీవ్రంగా ఉన్న కేసుల్లో నిందితులకు 6 నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష అమలు చేస్తారు. వారికి లక్ష నుంచి 5 లక్షల వరకు జరిమానా వసూల్ చేయనున్నట్లు ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఆ ఆర్డినెన్స్‌ను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఒకవేళ హాస్పిటల్ వాహనాలు, క్లినిక్‌లకు నష్టం జరిగితే, అప్పుడు మార్కెట్ విలువ ప్రకారం రెండింతల మొత్తాన్ని వసూల్ చేయనుని ప్రకటించారు.
దాడులకు నిరసనగా దేశ వ్యాప్తంగా బుధవారం నిరసన దినంగా పాటిస్తామని వైద్యులు ప్రకటించడంతో వారి ప్రతినిధులతో ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ తో కలసి హోమ్ మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేటి ఉదయం సమాలోచనలు జరిపారు.
కరోనా మహమ్మారిని పారద్రోలడంలో వైద్యుల పాత్ర అమోఘమనికొనియాడుతూ వైద్య సిబ్బందిపై ఎలాంటి దాడులు జరగకుండా వారికి పూర్తి రక్షణ చర్యలు కల్పిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ఈ ఆర్డినెన్సు రావడం గమనార్హం.
మోదీ ప్రభుత్వం డాక్టర్లకు పూర్తి అండగా ఉంటూ, రక్షణ కల్పిస్తుందని, ఎలాంటి నిరసనలకు దిగవద్దని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. ఇంతటి క్లిష్ట సమయంలో ఎలాంటి నిరసనలకు దిగవద్దని, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ ప్రతినిధులు కూడా వైద్యులకు విజ్ఞప్తి చేశారు.
తమపై కూడా ఎలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టాల్సిందేనని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు షాకు తేల్చి చెప్పారు. సాక్షాత్తూ హోంమంత్రి నుంచే భరోసా రావడంతో తలపెట్టిన ఆందోళనలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెనక్కి తీసుకుంది.
మరో వైపు మధ్యప్రదేశ్, యూపీ, బిహార్, బెంగళూరులో జరిగిన దాడులను సోషల్ మీడియాలో డాక్టర్ల బృందం మరోసారి విడుదల చేసింది. రోజురోజుకీ కరోనా వైద్యం చేస్తున్న సమయంలో తమపై దాడులు పెరిగిపోతున్నాయంటూ వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే ఓ చట్టాన్ని కూడా తీసుకుని రావాలని లేదంటే తాము బ్లాక్ డే పాటిస్తామని వైద్యులు హెచ్చరించిన విషయం తెలిసిందే.