
లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం డిమాండ్‌ను పసిగట్టిన ఓ మెడికల్ రిప్రజెంటేటివ్ ఇదే అదునుగా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా మద్యం తయారు చేసేందుకు రంగంలోకి దిగాడు. మెడికల్ రీప్రజెంటేటివ్ తనకున్న పరిచయాలతో అధిక సంఖ్యలో శానిటైజర్ లను తీసుకువచ్చాడు. మరో ముగ్గురితో కలసి శానిటైజర్ లో ఉండే ఆల్కహాల్కు మరికొన్ని పదార్థాలు కలిపి మద్యం తయారు చేసి విక్రయించ సాగాడు.
అనంతపురంలోని కమలానగర్ రఘువీరా కాంప్లెక్స్ ప్రాంతంలో నలుగురు కల్తీ సారా విక్రయిస్తున్నారని తెలుసుకుని అధికారుల ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లింది. ఓ వ్యక్తిని సారా కొనేందుకు పంపారు. సదరు వ్యక్తి కొనుగోలు చేస్తుండగా అధికారుల బృందం నిందితులు నలుగురిని అరెస్ట్ చేసి.. 18 శానిటైజర్ల సీసాలు, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం ఆబ్కారీశాఖ కార్యాలయంలో ఉప కమిషనర్ విజయశేఖర్ విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. మద్యం అక్రమంగా విక్రయాలు చేస్తే కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. కొందరు సారా కాస్తున్నట్లు సమాచారం అందడంతో ఇప్పటికే ఇటువంటి వారిని దాడి చేసి పట్టుకోవడం జరిగిందన్నారు.