ఏపీ సీఎం జగన్ కు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. తీసుకున్న నిర్ణయాలలో పలు నిర్ణయాలకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతుంటే మిగిలిన నిర్ణయాలకు అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నాయి. జగన్ అమలు చేయాలనుకున్న చాలా పథకాలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో నాణ్యమైన బియ్యం అమలుకు తేదీలను ప్రకటించారు.
అయితే నాణ్యమైన బియ్యం ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. మరోవైపు అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా, లాక్ డౌన్ వల్ల మార్చి నెలలో వాయిదా పడ్డాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం అంత తేలిక కాదు. ఎన్నికల అధికారులు సైతం స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఏమీ చెప్పలేకపోతున్నారు.
మరోవైపు కోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విషయంలో కూడా వాయిదాల మీద వాయిదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు జగన్ సర్కార్ రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఉగాది పండుగ సందర్భంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని భావించింది. అయితే ఇప్పటికే ఆ పథకం అమలు చాలాసార్లు వాయిదా పడింది. కోర్టులో పిటిషన్లు దాఖలు కావడం వల్ల ఈ పథకం ఎప్పుడు అమలవుతుందో తెలీదు.
తాజాగా రాష్ట్రంలో మరో పథకం అమలు వాయిదా పడింది. అక్టోబర్ 5న జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేయాలని భావించిన ప్రభుత్వం కరోనా తీవ్రత దృష్ట్యా వాయిదా వేసింది. జగన్ నిర్ణయాలు, పథకాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉండటం గమనార్హం.