అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి విదితమే. ట్రంప్ లో పెద్దగా లక్షణాలు కనబడనప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా వాల్డర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ లో ట్రంప్ చికిత్స పొందుతున్నారు. ట్రంప్ విధులను వైస్ ప్రెసిడెంట్ కు బదిలీ చేయకుండా ఆయనే స్వయంగా నిర్వర్తిస్తున్నారు. ట్రంప్ వయస్సు ప్రస్తుతం 74 సంవత్సరాలు.

ఇప్పటికే శాస్త్రవేత్తలు కరోనా వైరస్ వృద్ధులపై ప్రభావం చూపుతుందని చెప్పిన సంగతి తెలిసిందే. ట్రంప్ లో కరోనా లక్షణాలు కనిపించకపోయినా ఆయన ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రెండు రోజులు చాలా కీలకమని.. ట్రంప్ శరీరంలోని పలు అవయవాలపై కరోనా వైరస్ ప్రభావం పడిందని అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం ట్రంప్ ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు ప్రకటన చేశారు.
ఆయనలో జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు కనిపించడం లేదని అవయవాల పనితీరు క్రమంగా మెరుగుపడిందని వెల్లడించారు. అయితే ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉందని చెబుతున్న వైద్యులు ఆయన కోలుకోవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేకపోతున్నారు. రెండు రోజుల తర్వాత ట్రంప్ ఆరోగ్యం గురించి క్లారిటీ వస్తుందని ఆ సమయంలోనే డిశ్చార్జి గురించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
మరోవైపు ట్రంప్ మాత్రం తాను క్షేమంగానే ఉన్నానని కీలక ప్రకటన చేశారు. 18 సెకన్ల నిడివి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ విషయాలను వెల్లడించారు. ట్రంప్ భార్య మెలనియా దగ్గు, జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది.