AP High Court: గతంలో ఏదైనా శాఖలో వైఫల్యం వెలుగు చూస్తే సంబంధిత ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధ్యులయ్యే వారు. బాధ్యతగా తమ పదవులకు, కొలువులకు రాజీనామా చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. ఒకవేళ న్యాయస్థానాల వరకు వెళ్లి.. ధర్మాసనం తప్పు పడితే అది ఘోర వైఫల్యంగా భావించేవారు. కానీ ఇప్పుడు కోర్టులు తప్పు పట్టినా పట్టించుకోవడం లేదు. కోర్టు ఇచ్చే సూచనలు పట్టడం లేదు. ధిక్కార కేసులతో కోర్టులనే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. తమ ఆదేశాలను పాటించకపోవడంతో న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తం చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏపీలో దాపురించింది.
తాజాగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఇద్దరు ఐఏఎస్ లకు నెలరోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు శ్యామలరావు, పోలా భాస్కర్ లకు రూ.1000 చొప్పున జరిమానా సైతం విధించింది. నీరు చెట్టు పథకం విషయంలో కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో కోర్టు ఆగ్రహించింది. డిసెంబర్ 8 లోపు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వద్ద లొంగిపోవాలని ఆదేశాలిచ్చింది. అయితే అధికారులకు శిక్షలు, జరిమానాలు విధించడం కొత్తకాదు. గతంలో ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు భోజనం వండి పెట్టాలని శిక్ష విధిస్తూ కోర్టులో తీర్పు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఒకరిద్దరు అధికారులు హాస్టళ్లకు వెళ్లి విద్యార్థులకు వండి పెట్టారు కూడా. కానీ కోర్టు ధిక్కారాన్ని అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. వారికి రాజకీయ ప్రాపకాలే ముఖ్యంగా మారుతున్నాయి. కేసులను లైట్ తీసుకుంటున్నారు. అందుకే కోర్టులు పెద్దపెద్ద ఆదేశాలు ఇస్తున్నా పెడచెవిన పెడుతున్నారు.
గతంతో పోల్చుకుంటే ఇటీవల అధికారులు కోర్టు మెట్లు ఎక్కడం తగ్గింది. కానీ తాజాగా నీరు చెట్టు పథకం చెల్లింపుల విషయంలో ఇద్దరు అధికారులు ధిక్కారానికి పాల్పడ్డారు. కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. అయితే ఇవన్నీ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల చెల్లింపుల విషయంలో జరిగినవే. వాటిని చెల్లించకూడదు అన్నది వైసీపీ సర్కార్ అభిమతం. దానిని పక్కాగా అమలు చేసి అధికారులు బుక్ అవుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టిన చాలామందికి చెల్లింపులు జరగలేదు. ఇంతలో ప్రభుత్వం మారింది. వారంతా టిడిపి సానుభూతిపరులేనని భావించిన వైసీపీ సర్కార్.. బిల్లుల చెల్లింపు విషయములో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. దీనికి అధికారులు బాధ్యులవుతున్నారు. అయితే బాధిత అధికారుల్లో సీఎం సొంత సామాజిక వర్గం వారు లేకపోవడం విశేషం. ప్రస్తుతం ఆదాయం వచ్చే శాఖలకు సొంత సామాజిక వర్గం వారు విభాగాధిపతులుగా వ్యవహరిస్తుండగా.. కోర్టు మెట్లు ఎక్కాల్సిన దయనీయ పరిస్థితిని మిగతా సామాజిక వర్గ అధికారులు ఎదుర్కోవడం.. ఏపీలో ఉన్న పరిస్థితిని తెలియజేస్తోంది. ఇప్పటికైనా అధికారుల తీరు మారుతుందో లేదో చూడాలి.