నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ అయిన తొమ్మిదేళ్ల దీక్షిత్ రెడ్డిని కిడ్నాపర్ అత్యంత కిరాతకంగా చంపడంతో బాలుడు కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. బిడ్డ క్షేమంగా తిరిగి వస్తాడనుకున్న తల్లిదండ్రులకు బాలుడి మరణం తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసిన వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేసిన గంటలోపే హత్య చేసి, ఆ తరువాత డబ్బుల కోసం ఫోన్ కాల్స్ చేశాడు. ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే సమయంలో పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
Also Read: రైతుల కోసం మోడీ మరో గొప్ప పథకం..
బాలుడిని డబ్బుల కోసమే కిడ్నాప్ చేస్తే.. కిడ్నాప్ చేసిన వెంటనే హత్య చేయడం ఏంటి..? బాలుడిని చంపాక ఇంటర్నెట్ ద్వారా కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి..? అని ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. బాలుడు తండ్రి జర్నలిస్టు కావడంతో, ఈ హత్య వెనుక ఇంకేదైనా కుట్రకోణం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌ను రూపొందించిన పోలీసులు పలు కీలక విషయాలను వెల్లడించారు.
ఏడాది నుంచి నిందితుడు డింగ్ టాక్ అనే యాప్‌ను వాడుతున్నాడు. ఈ యాప్ ద్వారానే బాలుడి తల్లిదండ్రులకు మంద సాగర్ ఫోన్ చేశాడు. డబ్బులు డిమాండ్ చేశాడు. పెట్రోల్ బంకుకు వెళ్దామని మంద సాగర్ బాలుడిని తీసుకెళ్లినట్లుగా పేర్కొన్న పోలీసులు, తెలిసిన వ్యక్తి కావటంతో వెళ్లాడని పేర్కొన్నారు. మంచినీళ్లలో నిద్రమాత్రలు కలిపి బాలుడితో తాగించాడని, బాబు స్పృహలోకి వచ్చే లోపే హత్య చేశాడని పేర్కొన్నారు.
మరోపక్క దీక్షిత్ రెడ్డిని అత్యంత కిరాతకంగా హతమార్చి, పెట్రోల్ పోసి తగలబెట్టి కనీసం కడసారి గుండెలకు హత్తుకొనేలా కూడా లేకుండా చేశారని దీక్షిత్ రెడ్డి తల్లి కన్నీరుమున్నీరవుతోంది. తన కొడుకుని ఎలా చంపారో కిడ్నాపర్‌ను కూడా అలానే చంపాలని ఆమె డిమాండ్ చేస్తోంది.
Also Read: చెరువు కింద బిక్కు బిక్కు.. భయం భయంగా హైదరాబాదీలు
దీక్షిత్ రెడ్డి హత్య ఘటనతో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కిడ్నాపర్‌ను ఉరితీయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేసింది. డబ్బుల కోసం చిన్న పిల్లలను హతమార్చడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. కిడ్నాపర్ సాగర్‌తోపాటు సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.