Lok Satta- Janasena: ఏపీలో కొత్త రాజకీయ సమీకరణలు ఆవిష్కృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికలకు అధికార, విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. అటు విపక్షాల మధ్య పొత్తు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో లోక్ సత్తా రీ ఎంట్రీ, అమ్ అద్మీ వంటి పార్టీలు సైతం తెరపైకి వస్తున్నాయి. కొన్నేళ్ల పాటు ఎన్నికలకు దూరంగా ఉన్న లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ ఏపీ విభజన హామీల సాధనకు గాను ఎంపీగా పోటీచేయాలని భావిస్తున్నారు. అందుకే ఆయన ఏపీ రాజకీయ పరిస్థితులపై స్పందిస్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యం కాదని తేల్చిచెబుతున్న ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. అటు ఆయన తిరిగి యాక్టివ్ అవ్వడంపై లోక్ సత్తా పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుతం విశాఖ కేంద్రంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీచేసి సత్తా చాటారు. అధికార పార్టీకి దీటుగా ఓట్లు కొల్లగొట్టారు. అందుకే ఈసారి విశాఖ నుంచి ఎంపీగా పోటీచేయాలని జేపీ భావిస్తున్నారు. అందుకు భావసారుప్యత కలిగిన పార్టీలతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే ఆయన జనసేనతో కలిసి నడవాలని భావిస్తున్నారు. విశాఖ నుంచి కానీ.. విజయవాడ నుంచి కానీ లోక్ సభకు ఎన్నికవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకే జనసేనకు స్నేహహస్తం అందించారు. ఒక వేళ జనసేన టీడీపీతో కలిసి వెళ్తే మాత్రం జయప్రకాష్ నారాయణ ప్రత్యామ్నాయంగా అమ్ ఆద్మీ పార్టీతో కలిసి వెళతారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఫస్ట్ ప్రయారిటీ మాత్రం జనసేనే. పవన్ తో కడిసే నడిచేందుకు జేపీ ఆసక్తికనబరుస్తున్నట్టు సమాచారం.

2009లో ఉమ్మడి ఏపీ నుంచి జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా పార్టీ బరిలో దిగింది. అయితే జేపీ ఒక్కరే కుక్కట్ పల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రాష్ట్ర విభజన తరువాత ఆయన ఎక్కడా పోటీచేయలేదు. తొలిసారి ఏపీ విభజన సమస్యలను అజెండగా తీసుకొని పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. జేపీది ప్రకాశం జిల్లా అయినా విశాఖ ఎంపీ స్థానంపైనే ఆయన మొగ్గుచూపుతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు కుదిరితే విశాఖ ఎంపీ స్థానాన్ని సునాయాసంగా గెలుపొందవచ్చని భావిస్తున్నారు. లోక్ సత్తా, జనసేనల మధ్య భావాలు చాలావరకూ దగ్గరగా ఉంటాయని.. అందుకే జనసేన అయితేనే మళ్లీ లోక్ సత్తాకు జవసత్వాలు నింపవచ్చని జేపీ భావిస్తున్నారు. ఒకవేళ జనసేనతో పొత్తు కుదరకుంటే మాత్రం ఏపీలో కొత్తగా ప్రవేశించిన అమ్ అద్మీతో ముందుకు నడవాలని జేపీ నిర్ణయించుకున్నారు.