
ఒక జర్నలిస్టును అరెస్ట్ చేయడానికి ఏకంగా యుద్ధ విమానం పంపిన ఆ దేశ ప్రభుత్వంపై.. దేశ అధ్యక్షుడిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన పాపానికి జర్నలిస్టును అరెస్ట్ చేయడానికి బెలారస్ దేశ ప్రభుత్వం యుద్ధం విమానం పంపింది. అతడు ప్రయాణిస్తున్న విమానాన్ని తమ దేశానికి తీసుకొచ్చి మరీ అరెస్ట్ చేయడం సంచలనమైంది.
బెలారస్ లో గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలిచాడని ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో పై అక్కడి మీడియా, ఆందోళనకారులు పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. అల్లర్లలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఆందోళనపై సీరియస్ అయిన అధ్యక్షుడు లుకాషెంకో దాని వెనుక కొందరు జర్నలిస్టులు, సామాజికకార్యకర్తల హస్తం ఉందంటూ వారి అరెస్టులకు పూనుకున్నారు. అక్రమ కేసులు పెట్టారు.
ఆందోళనల్లో కీలక పాత్ర పోషించిన 26 ఏళ్ల జర్నలిస్ట్ రోమన్ ప్రొటాసెవిచ్ మరికొందరు దేశం విడిచి పారిపోయారు. పోలాండ్ లో తలదాచుకుంటున్నాడు. ఆదివారం రోమన్ ఏథెన్స్ నుంచి విల్నియస్ కు విమానంలో వెళుతున్నాడని బెలారస్ ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో ఆ విమానంపైకి ఏకంగా బెలారస్ యుద్ధవిమానాన్ని పంపింది. విమానాన్ని బలవంతంగా దారిమళ్లించి బెలారస్ రాజధాని మింక్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించింది. ఆ తర్వాత జర్నలిస్ట్ రోమన్ ను అరెస్ట్ చేసింది. తనకు మరణశిక్ష విధిస్తారని బెలారస్ తీసుకుపోవద్దని విమాన సిబ్బందిని కోరగా వారు వినలేదు. దీనిపై అమెరికా సహా ప్రపంచదేశాలు భగ్గుమన్నాయి. జర్నలిస్ట్ ను అరెస్ట్ చేసేందుకు 120 మంది ప్రయాణికులను రిస్క్ లో పడేస్తారా? ప్రశ్నించినందుకు జర్నలిస్ట్ ను అరెస్ట్ చేస్తారా? అని బెలారస్ పై ఫైర్ అయ్యాయి. వారి విమానాలపై నిషేధం విధించాయి.