Seema Haider : సీమా హైదర్.. ప్రస్తుతం ఈ పేరు ఇటు భారత్.. అటు పాకిస్థాన్ దేశాల్లో మారుమోగుతోంది. పబ్జీలో ఏర్పడిన పరిచయంతో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సచిన్‌మీనా అనే యువకుడిని ప్రేమించి ఏకంగా నలుగురు పిల్లలతో కలిసి అక్రమంగా భారత్‌లోకి అడుగు పెట్టింది సీమా హైదర్. ఈమెపై ఎన్‌ఐఏ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్థాన్ పంపించే అవకాశాలను భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆమె ఎలా వచ్చింది.. ప్రమే కారణమా.. ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అని ఆరా తీస్తోంది. ఈ క్రమంలో సీమా ఇటీవల పంద్రాగస్టు రోజు భారత జాతీయ పతాకం ఎగురవేసింది. భారత్ మాతాకీ జై అని నినదించింది.
ఇప్పుడు సోదర సంబంధం..
మొన్న భారత జాతీయ పతాకానికి వందనం చేసిన పాకిస్థానీ మహిళ.. తాజాగా భారతీయ ప్రముఖ పండుగల్లో ఒకటైన రాఖీని కూడా సంప్రదాయంగా జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో వచ్చే రాఖీ పౌర్ణమి నాటికి దేశ ప్రముఖులకు రాఖీలు పంపాలని నిర్ణయించుకుంది.
మోదీ, అమిత్ షా, యోగిలకు రాఖీలు..
భారత్, పాక్ మధ్య చిగురించిన పబ్జీ ప్రేమతో రెండు దేశాల్లో ఫేమస్‌గా మారిన సీమా హైదర్.. రాఖీ పండగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు సహా పలువురికి పోస్టులో రాఖీలు పంపించింది. దీంతో ఆమె మరోసారి మీడియాలో నిలిచింది. ఆగస్టు 30 వ తేదీన రక్షా బంధన్ ఉండటంతో సీమా హైదర్ వినూత్నంగా ఆలోచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు దేశంలోని ప్రముఖులకు పోస్ట్ ద్వారా రాఖీలు పంపింది. ఈ విషయాన్ని సీమా హైదర్ స్వయంగా వెల్లడించింది. ఈమేరకు ఓ వీడియోను కూడా విడుదల చేసింది. పండగ రోజు నాటికి అందరికీ రాఖీలు అందాలని చాలా రోజుల ముందే పోస్టులో పంపించినట్లు వీడియోలో వెల్లడించింది.
ప్రముఖులపై ప్రశంసలు..
ఈ సందర్భంగా తాను రాఖీలు పంపిన ప్రముఖులపై కవిత ప్రశంసలు కురిపించింది. భారత దేశ బాధ్యతలను భుజాలకెత్తుకున్న తన సోదరుల్లాంటి వారికి తాను పంపించిన రాఖీలు సకాలంలో అందుతాయని సీమా హైదర్ తెలిపింది. దానికి తాను చాలా సంతోషిస్తున్నట్లు పేర్కొంది. జై శ్రీరాం.. జై హింద్.. హిందుస్థాన్ జిందాబాద్ అంటూ తాజాగా సీమా హైదర్ వీడియోను సోషల్ మీడియాలో ఉంచడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరోవైపు.. ఇంకో వీడియోను విడుదల చేసిన సీమా హైదర్ తన పిల్లలతో కలిసి రాఖీలను ప్యాక్ చేస్తున్నట్లు ఉంది. ‘భయ్యా మేరే రాఖీ కే బంధన్ కో నిభానా’ అనే రక్షాబంధన్ పాట వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తోంది.