CM Jagan: ఏపీ సీఎం జగన్ అదును చూసి విపక్షాలను కోలుకోలేని దెబ్బకొట్టారు. వారు కుదురుకునే లోగా పార్టీ సైన్యాన్ని ప్రయోగించారు. విపక్షాలు దూకుడుగా ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండేవారు. మౌనం పాటించేవారు. అయితే దాని వెనుక భారీ వ్యూహం ఉందని విపక్షాలు గుర్తించలేకపోయాయి. కానీ ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టు విపక్షాలను కోలుకోలేని దెబ్బతీయడంలో జగన్ సక్సెస్ అయ్యారు.
గత ఆరు నెలలుగా తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కార్యక్రమాలు విస్తృతంగా సాగాయి. చంద్రబాబుతో పాటు పవన్, లోకేష్ లు ప్రజల మధ్య గడిపారు. వారితో పోల్చుకుంటే జగన్ కార్యక్రమాలు చాలా తక్కువ. కేవలం సంక్షేమ పథకాల ప్రారంభం సమయంలోనే జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లేవారు. ప్రజల మధ్య బటన్ నొక్కేవారు. అంతకుమించి కార్యక్రమాలేవీ ఉండేవి కావు. మధ్యలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల బాట పట్టారు. కానీ ఎక్కడికక్కడే నిలదీతలు, ప్రశ్నలు ఎదురయ్యాయి.
అదే సమయంలో చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ, లోకేష్ యువ గళం పాదయాత్ర, పవన్ వారాహి యాత్రతో దూకుడుగా వ్యవహరించేవారు. అధికార వైసిపికి కలవరపాటుకు గురి చేసేవారు. ఇటువంటి సమయంలో జగన్ వ్యూహాత్మక మౌనానికి ప్రాధాన్యమిచ్చారు. సరిగ్గా అదును చూసి చంద్రబాబును అరెస్టు చేయించగలరు. రోజుల తరబడి రిమాండ్ లో కొనసాగేలా పావులు కలిపారు. తద్వారా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను అడ్డగించేలా చేశారు. మీ భవిష్యత్తుకు గ్యారెంటీ, యువ గళం పాదయాత్ర నిలిచిపోయాయి. టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ తో పవన్ వారాహి యాత్రకు బ్రేక్ పడింది. ఇలా విపక్షాలను అడ్డుకుంటూనే వైసీపీ కార్యక్రమాలను విస్తృతం చేయడానికి జగన్ వ్యూహం పన్నారు.
రాష్ట్రంలో ఏకకాలంలో మూడు ప్రాంతాల్లో వైసిపి సామాజిక సాధికార యాత్ర ప్రారంభం కానుంది. ఉత్తరాంధ్రాకు సంబంధించి ఇచ్ఛాపురంలో, కోస్తాంధ్రకి సంబంధించి తెనాలిలో, రాయలసీమకు సంబంధించి సింగనమల లో బస్సు యాత్ర ప్రారంభం కానుంది. నవంబర్ 9 వరకు తొలి విడత యాత్ర చేపట్టనున్నారు. అటు తర్వాత రెండో విడత యాత్ర షెడ్యూల్ సైతం ప్రకటించారు. దాదాపు సంక్రాంతి వరకు ఈ బస్సు యాత్రలు కొనసాగనున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలకు చేతినిండా పని కల్పించారు. ఎన్నికల వరకు వారిని యాక్టివ్ గా ఉండేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.