తమతో అసలు ఎటువంటి చర్చలు జరుపకుండా అర్ధాంతరంగా సచివాలయాన్ని అమరావతి నుండి విశాఖపట్నంకు మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల పట్ల సచివాలయం ఉద్యోగులు మండిపడుతున్నారు. పైగా ఈ విషయమై ఏ క్షణంలో అయినా ప్రభుత్వ ఉత్తరువులు రావచ్చని అంటూ తమ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఏకపక్షంగా ప్రకటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్ నెపంతో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయకుడినా కార్యనిర్వాహకవర్గ సమావేశంలోనే ఈ నిర్ణయం ప్రకటించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు విశాఖలో సచివాలయం ఎక్కడ ఉన్నదని, ఏ భవనాన్ని ఎంపిక చేసారని నిలదీస్తున్నారు. మొత్తం సచివాలయం ఒకేచోట ఉంచేందుకు అనువైన భవనం విశాఖలో అసలు లేదని అంటూ కొట్టిపార వేస్తున్నారు.
సచివాలయాన్ని ఒక్క చోట కాకుండా ముక్కలు ముక్కలుగా చేసి అనేకచోట్ల పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా చేస్తే ఉద్యోగులు చెల్లాచెదురై అనేక ఇబ్బందులు పడవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం అమరావతిలో ఉన్న సచివాలయంలో ఆఫీస్ స్పేస్ 5 లక్షల చదరపు అడుగులు ఉందని, ఈ స్థలం సరిపోక అనేక మంది సలహాదార్లకు ఇంకా చాంబర్లే కేటాయించని విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. వైజాగ్‌లో 5 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉన్న భవనాన్ని గుర్తించారా అనే విషయాన్ని అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టంగా చెప్పి ఉండాల్సిందని నిలదీస్తున్నారు.
ఉద్యోగుల సౌలభ్యం, పనిచేసే వాతావరణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం చెప్పినదానికి తల ఊపే సంఘం అధ్యక్షుడి ధోరణి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘం సచివాలయ ఉద్యోగులకు ప్రతినిధిగా వ్యవహరిస్తోందా లేక ప్రభుత్వానికి ప్రతినిధిగా వ్యవహరిస్తోందా అని నిలదీస్తున్నారు.
వికేంద్రీకరణ పేరుతో ఇప్పటికే సచివాలయంలో భాగమైన విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీ్‌సని కర్నూలుకు తరలిస్తూ జీవోలు ఇచ్చారని, అది కోర్టులో ఉండగానే ఇప్పుడు తరలింపునకు సిద్ధంగా ఉండాలంటూ అధ్యక్షుడు చెప్పడాన్ని ఉద్యోగులు తప్పుబడుతున్నారు.
ఇలా ఉండగా, కనీసం తమ సమస్యలు, ఇబ్బందులు ఏమిటో తెలుసుకోకుండానే తమ వ్యక్తిగత డేటా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఇవ్వాలంటూ.. ఒక ప్రొఫార్మాను ఉద్యోగులకు సంఘం పంపడాన్నీ ఉద్యోగులు ఆక్షేపిస్తున్నారు. ఏ ఉద్దేశంతో తమ నుంచి ఈ వివరాలు కోరుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.