Hyderabad Airport: హైదరాబాద్‌ తలరాత మారబోతోంది!

తెలంగాణ ప్రభుత్వం నగరంలో రెండో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించగా జూన్‌ 31న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో సూత్రప్రాయంగా అంగీకరించారు.

Written By: Raj Shekar, Updated On : August 2, 2023 11:18 am
Follow us on

Hyderabad Airport: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. బెంగళూరు తర్వాత అత్యధిక పెట్టుబడులు ఆకర్షిస్తోంది. విదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. పరిశ్రమలు, కంపెనీలు పెరుగుతుండడంతో హైదరాబాద్‌కు వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సరిపోవడం లేదు. దీంతో హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరంలో రెండో విమానాశ్రయం అవసరమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

వాణిజ్య విమానాల కోసం..
తెలంగాణ ప్రభుత్వం నగరంలో రెండో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించగా జూన్‌ 31న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో సూత్రప్రాయంగా అంగీకరించారు. దీంతో త్వరలో రెండు వాణిజ్య విమానాశ్రయాలు ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌ చేరే అవకాశం ఉంది.

హకీంపేటలో ఏర్పాటు..
నగరంలోని హకీంపేట్‌లోని డిఫెన్స్‌ ఎయిర్‌పోర్టును పౌర విమానయానం కోసం ఉపయోగించేందుకు అనుమతించాలని కేంద్రాన్ని అభ్యర్థించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయం త్వరలో రక్షణ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది. హకీంపేట్‌ స్టేషన్‌ పూణే, గోవా తరహాలో హైబ్రిడ్‌ మోడల్‌లో పనిచేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

శంషాబాద్‌కు ఏటా 2.5 కోట్ల మంది..
ప్రస్తుతం హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఏటా 2.5 కోట్ల మంది ప్రయాణికుల అవసరాలను తీరుస్తోంది. నగరం వేగంగా అభివృద్ధి చెందడంతో, రెండవ విమానాశ్రయం అవసరమని మంత్రివర్గం భావించింది.

దేశంలో రెండు విమానాశ్రయాలు
భారతదేశంలో ఢిల్లీ, గోవాలో రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. ఢిల్లీలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కాకుండా, ఈ ప్రాంతంలో హిండన్‌ వాణిజ్య విమానాశ్రయం కూడా ఉంది. ఇక దేశంలో అతిచిన్న రాష్ట్రమైన గోవాలో కూడా రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. ఒకటి ఉత్తర గోవాలో మరొకటి దక్షిణ గోవాలో ఉంది. అవి దబోలిమ్‌ విమానాశ్రయం, మనోహర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం.

ప్రపంచంలో రెండు విమానాశ్రయ నగరాలు..
అంతర్జాతీయంగా రెండు విమానాశ్రయాలను కలిగి ఉన్న అనేక నగరాలు ఉన్నాయి. వాటిలో కొన్ని..

బెల్జియం బ్రస్సెల్స్‌
పోలాండ్‌ వార్సా
కెనడా మాంట్రియల్‌
చైనా బీజింగ్‌
టర్కీ ఇస్తాంబుల్‌ మరియు
యూకేలోని గ్లాస్గో నగరాల్లో రెండు ఎయిర్‌ పోర్టులు ఉన్నాయి.