TDP: టీడీపీలో ఆగస్టు సంక్షోభం.. తెలుగు తమ్ముళ్లలో టెన్షన్‌!

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఉన్న సమయంలోనే కీలకమైన మూడు ఆగస్టు సంక్షోభాలను పార్టీ ఎదుర్కొంది. ఇందులో రెండింటిని ఎన్టీఆర్‌ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

Written By: Raj Shekar, Updated On : August 2, 2023 11:23 am

TDP

Follow us on

TDP: ఆగస్టు నెల అంటేనే టీడీపీకి పెద్ద గ్రహపాటు నెలగా చెబుతుంటారు ఆ పార్టీ నేతలు. తెలుగుదేశానికి ఇబ్బంది తెచ్చిపెట్టిన ఘటనలు అన్నీ ఆ నెలలోనే జరుగుతూ ఉండడంతో పార్టీ దృష్టిలో ఆగస్టుకు ఆ ముద్ర పడిపోయింది. 2023, ఆగస్టు ప్రారంభం కావడంతో మళ్లీ ఆ పార్టీ నేతల్లో టెన్షన్‌ కనిపిస్తోంది.

ఆగస్టు సంక్షోభాలు కొన్ని..
అదేంటోగానీ టీడీపీకి ఆగస్టు నెల అంటేనే సమస్యల సుడిగుండం అనే పేరు పడిపోయింది. నాదెండ్ల భాస్కర్‌రావు ఎపిసోడ్‌ మొదలు పార్టీ ఆగస్టునెలలోనే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తుంది. రేణుకా చౌదరి ఒక ఆగస్టులో గొడవకు దిగడం, చంద్రబాబు నాయుడు పార్టీని హస్తగతం చేసుకోవడం కూడా ఆగస్టులోనే జరగడం వంటి కారణాలతో ఆగస్టు సంక్షోభం అనే ముద్ర పడింది. ఇప్పటికీ చిన్నచిన్న మార్పులు ఆగస్టులోనే జరుగుతున్నాయి. ప్రధాన ఘటనలు మాత్రం మూడే. అవి కూడా ఆగస్టులోనే జరిగాయి. అయితే ఇవి రెగ్యులర్‌గా జరుగడం లేదు.

28 ఏళ్లుగా చంద్రబాబు చేతిలో..
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఉన్న సమయంలోనే కీలకమైన మూడు ఆగస్టు సంక్షోభాలను పార్టీ ఎదుర్కొంది. ఇందులో రెండింటిని ఎన్టీఆర్‌ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. నాదెండ్ల భాస్కర్‌రావు, రేణుకాచౌదరి తిరుగుబాట్లను తిప్పికొట్టారు. కానీ, అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తిరుగుబాటును మాత్రం ఎదుర్కొలేకపోయారు. దీంతో బాబు 1995లో పార్టీని తన చేతుల్లోకి తెచ్చుకున్నారు. 28 ఏళ్లగా పార్టీని నడిపిస్తున్నారు. అయితే ఈ 28 ఏళ్లలో పెద్దగా చెప్పుకోదగిన సంక్షోభాలేవీ టీడీపీలో జరుగలేదు.

బాబుకు పూర్తి పట్టు..
పార్టీపై చంద్రబాబు పూర్తి పట్టు సాధించారు. దీంతో బాబుపై ఎవరైనా అసంతృప్తితో ఉన్నా.. బహిరంగంగా మాట్లాడరు. కానీ వైసీపీలో ఆ పరిస్థితి లేదు. సీఎం జగన్‌ చెబుతున్న పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తిరుగుబాటు కొనసాగిస్తున్నారు. ధర్మానప్రసాదరావు కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం రామ్‌నారాయణరెడ్డి వైసీపీలో తిరుగబాటు చేశారు. వైసీపీని వీడారు. మాజీ మంత్రి అనిల్‌కు, ఆయన మేనమామ మధ్య వైరం కొనసాగుతోంది. కానీ టీడీపీలో ఇలాంటి పరిస్థితి కనబడదు. పార్టీని వీడాలనుకునేవారు నేరుగా వెళ్లిపోతారు తప్ప బాబును విమర్శించడం చేయరు.

ఈ ఆగస్టులో ఏం జరుగుతుంది..
ఇదిలా ఉంటే ఈ ఆగస్టులో టీడీపీలో కీలక మార్పులు ఏమైనా జరుగతాయా అంటే.. చిన్నచిన్న ఘటనలు జరిగే అకవాశం కనిపిస్తోంది. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ నాయకుల సహకరించడం లేదు. దీంతో మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌ కొడుకు కోడెల శివరామ్‌తోపాటు మరో 30 మందికి అధిష్టానం నోటీసులు ఇచ్చింది. దీంతో శివరామ్‌ పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. ఇంకా కొంతమంది కూడా అధికార వైసీపీతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.

కొరుకుడు పడని కేశినేని..
ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం కూడా పార్టీకి మింగుడు పడడం లేదు. బాబుపై ఆయన బహిరంగంగానే విమర్శలు చేస్తున్నాయి. అయినా బాబు చర్యలు తీసుకోవడం లేదు. నాని ఇటీవల చంద్రబాబు సమక్షంలో వ్యవహరించిన తీరు పార్టీ అధిష్ఠానాన్ని అవాక్కయ్యేలా చేసింది. తనకు బదులు తన తమ్ముడు కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తున్నారనే ఉద్దేశంతో అలకబూనిన నాని ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు పూల బొకే ఇవ్వడానికి కూడా నిరాకరించారు. రానున్న ఎన్నికల్లో విజయవాడలో టీడీపీ రాజకీయం ఏ విధంగా ఉండబోతుందో అన్న చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతుంది.