కరోనా వైరస్ కారణంగా ఆరు వారాల పాటు వాయిదా వేసిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్ట్ కొట్టివేసిన కొద్దీ సేపటికే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ రాష్ట్రంలో ప్రభుత్వ ధోరణి కారణంగా నెలకొన్న హింసాయుత వాతావరణాన్ని వెల్లడి చేస్తూ కేంద్ర హోమ్ కార్యదర్శికి వ్రాసిన ఐదు పేజీల లేఖ సంచలనం కలిగిస్తున్నది.
ఆ లేఖలో ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికలను ప్రశాంతంగా జరుపలేమని స్పష్టం చేస్తూ అందుకోసం కేంద్ర బలగాలను పంపాలని కోరారు. తనపై వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికార పార్టీ నేతలు దాడులు, బెదిరింపులు చేస్తున్నారని, కులం పేరుతో తనను నిందిస్తున్నారని చెబుతూ తనకు కూడా ప్రాణహాని ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు కూడా భద్రత కల్పించాలని, హైదరాబాద్ నుండి పనిచేసే అవకాశం కల్పించాలని కోరారు.
ఎన్నికలకు ముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలో తమ ప్రాంతాలలో పార్టీ అభ్యర్థులు ఓటమి చెందితే సంబంధిత మంత్రులు నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామాలు చేయాలని, సంబంధిత ఎమ్యెల్యేలకు వచ్చే ఎన్నికలలో సీట్లు ఇవ్వబోమని స్వయంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బెదిరించారని గుర్తు చేశారు. దానితో మంత్రులు, ఎమ్యెల్యేలు విచ్చలవిడిగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
పలు చోట్ల అభ్యర్థులను దౌర్జన్యంగా నామినేషన్లు వేయనీయలేదని, వేసిన వారిని బలవంతంగా ఉపసంహరించుకునేటట్లు చేసారిని రమేష్ కుమార్ ఆ లేఖలో వివరించారు. గత పర్యాయం జరిగిన ఎన్నికలలో .001 శాతం ఎంపీటీసీ లలో మాత్రమే ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే ఇప్పుడు 24 శాతం వరకు జరిగాయని పేర్కొన్నారు.