కాంగ్రెస్ మాజీ నాయకులు జ్యోతిరాధిత్య సింధియా భారతీయ జనతా పార్టీలో చేరడం, వెంటనే ఆయనకు మధ్యప్రదేశ్ నుండి పార్టీ రాజ్యసభ సీట్ కేటాయించడం బుధవారం చకచకా జరిగిపోయాయి. బీజేపీ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా సమక్షంలో సింధియా పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా సింధియాకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సింధియాకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. బీజేపీ రాజమాత విజయరాజే సింధియా కుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా సొంతగూటికి రావడం సంతోషంగా ఉందని జేపీ నడ్డా స్వాగతం పలికారు.
సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీని మంగళవారం వీడిన విషయం విదితమే. తన తండ్రి మాధవరావు సింధియా జయంతిరోజే ఆయన కాంగ్రెస్‌ను వీడారు. పార్టీలో 18 ఏండ్ల ప్రస్థానానికి ముగింపు పలికారు.
మరోవైపు బెంగళూరులోని రిసార్ట్‌లో ఉన్న సింధియా అనుకూల వర్గం ఎమ్మెల్యేలు 22 మంది సైతం తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఇందులో ఆరుగురు మంత్రులు ఉన్నారు. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడింది.
బీజేపీలోకి తనను తీసుకున్నందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు సింధియా కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితాన్ని రెండు ఘటనలు మలుపు తిప్పాయని, తండ్రి మరణం జీవితాన్ని మలుపు తిప్పిందని, ఆయన 75వ జయంతి మరోసారి తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించిందని చెప్పారు.
2020, మార్చి 10న సరికొత్త నిర్ణయం తీసుకున్నాను అని చెబుతూ నాయకుడికి జనసేన చేయడమే లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆలోచనలు స్వీకరించే పరిస్థితి లేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజలకు సేవ చేసే అదృష్టం బీజేపీ కల్పించిందని చెబుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పనలో విఫలమైందని ద్వజమెత్తారు.
యువతను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని, ఆ పార్టీలో యువత నిర్లక్ష్యానికి గురవుతోందని పేర్కొన్నారు. దీంతో దేశానికి యువత సేవలు అందించలేక పోతోందని చెప్పారు. కమల్‌నాథ్ ప్రభుత్వం అవినీతికి కొమ్ము కాస్తోందని ఆరోపించారు. 2019లో ఎవరూ ఊహించని అద్భుతమైన తీర్పు ప్రజలు బీజేపికి ఇచ్చారని చెబుతూ ప్రధాని మోదీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉందని సింధియా నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు.