Indian preschool teacher in a green saree in front of blackboard
కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పటికీ కోలుకోని రంగాల్లో విద్యారంగం ముందు వరసలో ఉంటుంది. రెండేళ్లుగా పిల్లలు పాఠశాలకు దూరమవడంతో.. చదువు ఆగమాగమైపోయింది. కొందరు అరకొర ఆన్ లైన్ బోధనతో గడిపేస్తుండగా.. మెజారిటీ విద్యార్థులు మాత్రం తరగతులకు దూరమైపోయారు. దీంతో.. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు తెరవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల భవిష్యత్ దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నప్పటికీ.. మరి, క్షేత్రస్థాయిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? పాఠశాలలను ఎలా నిర్వహించబోతున్నారు? అన్నది ప్రధాన సవాల్ గా మారింది.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజయ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, విద్యాశాఖ, పంచాయతీరాజ్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రులు వెల్లడించారు. అయితే.. విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడం.. వాటిపై అధికారుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం.. వాస్తవ పరిస్థితిని తెలియజేస్తోంది.
తరగతి గదుల్లో విద్యార్థుల భౌతిక దూరాన్ని ఎలా కొనసాగిస్తారన్నది ప్రధాన సమస్యగా మారింది. చాలా మందిలో ఇదే ఆందోళన ఉంది. ఇదే విషయాన్ని ఒక డీఈవో కూడా లేవనెత్తారు. తమ జిల్లాలో కొన్ని పాఠశాలల్లో దాదాపు 1400 మంది వరకు విద్యార్థులు ఉన్నారని, అలాంటి పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టసాధ్యమని మంత్రుల దృష్టికి తెచ్చారు. మరొక డీఈవో షిఫ్టుల విధానంలో తరగతులు కొనసాగిస్తే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు.
దీనిపై మంత్రులు స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఎంత ఉండాలనేది స్థానికంగా పాఠశాలలే చూసుకోవాలని చెప్పినట్టు సమాచారం. విద్యార్థుల మధ్య దూరం ఆరు అడుగులు ఉండాలా? రెండు అడుగులు ఉండాలా? అన్నది తాము చెప్పలేమని, సాధ్యమైనంత దూరం ఉండేలా చూడాలని, మాస్కులు ఖచ్చితంగా ధరించేలా చూడాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. గతంలో తరగతి గదికి 50 శాతం విద్యార్థులే ఉండాలన్న నిబంధన ఉంది. ఇప్పుడు దాన్ని ప్రస్తావించలేదు.
8 నుంచి పది తరగతుల విద్యార్థుల్లో భౌతిక దూరం విషయంలో అవగాహన ఉంటుందని, ఆలోపు విద్యార్థుల పరిస్థితి ఏంటన్నది ప్రధాన ఆందోళనగా మారింది. దూరం పాటించాలని చెప్పినప్పటికీ.. విద్యార్థులకు ఎంత వరకు అర్థమవుతుంది? వారిని నిలువరించడం సాధ్యమేనా? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. విద్యాశాఖ మాత్రం ఉత్తర్వులు జారీచేసింది. సెప్టెంబర్ ఒకటి నుంచి పాఠశాలలు తెరుచుకుంటాయని, తరగతులు మొదలవుతాయని అందులో పేర్కొంది. హాస్టళ్లు, పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, మధ్యాహ్న భోజనం వేళ పిల్లలు గుంపులుగా చేరకుండా చూడాలని పేర్కొన్నారు.
కానీ.. ఆచరణలో ఇవి సాధ్యమేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. పాజిటివ్ ఉన్నవారు ఒక్కసారి టచ్ చేస్తే ఖతమే. అలాంటిది.. పిల్లలందరినీ కనిపెట్టుకుని ఉండడం నిర్వాహకులకు, ఉపాధ్యాయులకు సాధ్యమవుతుందా? అనే సందేహం వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికైతే కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ భయం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇలాంటి సమయంలో సర్కారు తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి, పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది చూడాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Schools reopen in telangana what is the govt plan for third wave
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com