కరోనా కారణంగా గత ఎనిమిది నెలలుగా స్కూల్స్, కాలేజీలు మూతపడ్డాయి. చివరికి పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేయాల్సి వచ్చింది. చాలా వరకు రాష్ట్రాలు డైరెక్ట్ ప్రమోట్ చేశాయి. లాక్‌డౌన్ తర్వాత కేంద్రం ఒక్కో నెల అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించింది. ఈనెల అన్‌లాక్ 5.0 ప్రారంభమైంది. ఇందులో భాగంగా కేంద్రం స్కూల్స్, కాలేజీలు తెరుచుకునే అవకాశం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చింది.
Also Read: కేసీఆర్ కన్నా జగన్ బెటర్..! ఎందుకంటే.?
అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు, థియేటర్లు తెరచుకోవచ్చని కూడా సూచించింది. ఈ సడలింపుల నేపథ్యంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నవంబర్ 5 నుంచి రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మాత్రం ఇప్పట్లో తెరుచుకునేలా లేవు. దసరా తర్వాతే స్కూల్స్ రీ ఓపెన్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది.
ఈమేరకు బుధవారం ఈ సబ్‌కమిటీ సమావేశం అయింది. కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పాఠశాలల ప్రారంభం, నిర్వహణ సహా పలు అంశాలపై మంత్రి వర్గ ఉప సంఘంలో చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ హాజరయ్యారు. అక్టోబర్ 15 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలు తెరవడం సాధ్యం కాదని తేల్చారు.
కేరళలో ఓనం పండుగ తర్వాత వైరస్ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో తెలంగాణలోనూ బతుకమ్మ, దసరా పండుగల తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. విద్యాసంస్థల ప్రారంభంపై అధికారులు విధివిధానాలు రూపొందించి సీఎం కేసీఆర్‌కు ఇస్తే.. సీఎం తీసుకునే నిర్ణయం మేరకు ఓపెన్ చేయనున్నట్లు చెప్పారు. అయితే.. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కాలేజీలు మాత్రం నవంబర్ 1 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.
Also Read: బీజేపీ మౌనం వెనుక అర్థం ఏంటీ..?
‘రాష్ట్రంలో 86 శాతం మందికి ఆన్‌లైన్ విద్య అందుతోందని ఓ సర్వే ద్వారా తేలింది. రానున్న రోజుల్లో విద్యార్థులకు డిజిటల్ బోధన తప్పనిసరి. పాఠశాలల్లో వసతుల నిర్వహణను స్థానిక సంస్థలకు అప్పగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలి’ అని మంత్రి సబితా సూచించారు. ప్రైవేటు పాఠశాలలకూ ఇదే వర్తిస్తుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే కాదు.. వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అభిప్రాయపడ్డారు. దీని ప్రకారం.. తెలంగాణలో స్కూళ్లు ఓపెన్ పై దసరా తర్వాత కేసీఆర్ తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంది. అప్పటివరకు మాత్రం ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతాయి.