
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం కరోనా బారిన పడి ఐసోలేషన్ లో ఉన్నాడు. ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు. కానీ ట్విట్టర్ మాత్రం యాక్టివ్ గా ఉన్నాడు. కేటీఆర్ ట్విట్టర్ కు తాజాగా కాపాడాలంటూ అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. నాకు కరోనా టెస్ట్ చేయించేలా చూడండి మహాప్రభో అంటూ ఓ నెటిజన్ ప్రాథేయపడ్డాడంటే తెలంగాణ వైద్య సేవలు ఎంత దారుణానికి దిగజారాయో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కరోనా టెస్ట్ కూడా చేయించుకోలేనంతగా తెలంగాణలో రద్దీ పెరిగిపోయింది.. రోగులు క్యూ కట్టిన పరిస్థితులు అంతటా కనిపిస్తున్నాయి. రెండు రోజులకు కానీ ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితాలు రావడం లేదు.ఆస్పత్రుల్లో రెండు లక్షల రూపాయలు కడితేనే కానీ బెడ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడంతో ప్రజలు ఇళ్లు ఒళ్లు గుళ్ల చేసుకుంటూ ఆస్తులు అమ్ముతూ అప్పుల పాలవుతూ చికిత్స చేసుకుంటున్నారు.
ఇక తెలంగాణలో తమకు సాయం చేయాలని పెద్ద ఎత్తున మంత్రి కేటీఆర్ కరోనా రోగులు, బాధితులు మొరపెట్టుకుంటున్న దైన్యం కనిపిస్తోంది. రెమెడిసివిర్ ఇంజక్షన్లు కావాలని కొందరు.. ఆస్పత్రిలో బెడ్ దొరకట్లేదని మరికొందరు.. ఆక్సిజన్ సిలిండర్ కావాలని ఇంకొందరు.. ప్లాస్మా, కోవిడ్ పరీక్ష చేయించాలని మంత్రి కేటీఆర్ కు తాజాగా వందల మంది ట్విట్టర్ లో వేడుకుంటున్న దైన్యం కనిపిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత ఎక్కువగా ఉందని మంత్రి దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పట్టించుకోవడం లేదని చాలా మంది కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు.
వీటన్నింటికి మంత్రి కేటీఆర్ చాలా ఓపికగా సమాధానమిస్తున్నారు. తన కేటీఆర్ వ్యక్తిగత కార్యాలయంను పురమాయిస్తున్నాడు. వారు వెంటనే స్పందిస్తూ బాధితుల ఫోన్ నంబర్లను అడిగి తెలుసుకొని వెంటనే సాయం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కరోనాతో బయటకు రాకున్నా బాధితులకు సాయం అయితే చేస్తున్నారు. కానీ వెల్లువెత్తుతున్న అభ్యర్థనలు తెలంగాణలో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.