
తమిళ రాజకీయాలు మునుపు ఎన్నడూ లేనంత చప్పగా ఈసారి సాగాయి. అటు జయలలిత, ఇటు కరుణానిధి మరణంతో దిగ్గజాలు లేకుండా తమిళ అసెంబ్లీ ఎన్నికలు సాగాయి. హేమాహేమీలు లేని ఈ పోరులో డీఎంకే అధినేత స్టాలిన్ గెలిచి సీఎం అయ్యారు. అన్నాడీఎంకే ఓడిపోయింది. ఆ పార్టీ తరుఫున ఫళని స్వామి, పన్నీర్ సెల్వం అంతగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో జయలలిత పార్టీని మళ్లీ టేకప్ చేసి పార్టీకి పూర్వ వైభవం తేవడానికి చిన్నమ్మ శశికళ మళ్లీ రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమయ్యారు.
అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత మరణం తర్వాత శశికళ ఆ పార్టీని తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నారు. సీఎం అవుదామని కేంద్రంలోని బీజేపీని ఎదురించగా.. అక్రమాస్తుల కేసుల్లో అరెస్ట్ అయ్యి 4 ఏళ్లు జైలు శిక్ష పడి అనుభవించారు. అయితే బయటకొచ్చాక అన్నాడీఎంకే బాధ్యతలు చేపట్టకుండా రాజకీయ సన్యాసం స్వీకరించారు. బీజేపీ ఒత్తిడితోనే ఆమె రాజకీయాల నుంచి వైదొలిగారని ప్రచారం సాగింది.
శశికళ ఇప్పుడు మళ్లీ క్రియాశీల రాజకీయాలకు తిరిగి రావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఆడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జైలు నుంచి విడుదలయ్యాక శశికళ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె చేసిన ఈ ప్రకటన ఆమె అభిమానులతో పాటు దినకరన్ మద్దతుదారులను అన్నాడీఎంకే నేతలను నిరాశపరిచింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐఎడిఎంకె ఓటమి రాజకీయ సమీకరణాలను మార్చివేసింది.
ప్రస్తుతం, శశికళ క్రియాశీల రాజకీయాల్లోకి తిరిగి రావాలనే తన ఉద్దేశ్యం గురించి మాట్లాడుతున్న ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రచారం చేయబడుతోంది. ఇది వైరల్ అవుతోంది. ఆ క్లిప్‌లో రాజకీయాల్లోకి ఆమె తిరిగి ప్రవేశించడం గురించి కార్యకర్తలకు భరోసా ఇవ్వడం ఆమె వినిపించింది.
ఈ విషయాన్ని టిటివి దినకరన్ వ్యక్తిగత సిబ్బంది కూడా ధృవీకరించారు. ఈ పుకార్లు ఎంతవరకు నిజమో వేచి చూడాలి.జయలలిత అంత ఫేమ్ ఉన్న చిన్నమ్మ రాజకీయాల్లోకి వస్తే ఎంతటి ప్రభావం చూపుతుందో వేచిచూడాలి.