
వచ్చే ఏడాది ప్రారంభంలోనే బెంగాల్‌లో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈసారి పశ్చిమబెంగాల్‌లో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ దూకుడు మీద ఉంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది. అందుకే.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలను విరివిగా చేర్చుకుంటోంది. దీంతో బెంగాల్‌లో రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే ఈసారి బెంగాల్ ఎన్నికలు రసవత్తరంగానే కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
Also Read: బీజేపీ–జనసేన పొత్తు చెడిందంటూ ప్రచారం
అంతేకాదు.. కేంద్రంలో ఉన్న దర్యాప్తు సంస్థల ద్వారా తృణమూల్‌ను బీజేపీ టార్గెట్ చేసింది. శారదా చిట్ ఫండ్ స్కాంలో రూ. పదివేల కోట్లు చేతులు మారాయని.. దీని వెనుక తృణమూల్ నేతలున్నారనేది బీజేపీ ఆరోపణ. సీబీఐ కూడా విచారణ చేసింది. అప్పట్లో శారదా సంస్థ నుంచి డబ్బులు వసూలు చేశారని తృణమూల్ నేతలపై స్టింగ్ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ వెబ్ సైట్లలో అవి ప్రధానంగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని తొలగించారు. దానికి కారణం శారదా స్కాంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ నేతలంతా బీజేపీలో చేరిపోయారు.
శారదా గ్రూపునకు చెందిన చిట్‌ఫండ్ సంస్థలో పది లక్షల మందికి పైగా ప్రజలు రూ.10 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టి మోసపోయారు. ఈ స్కాం నేపథ్యంగా బీజేపీ రాజకీయ పోరాటాలు ప్రారంభించింది. సహజంగా అధికారంలో ఉన్న తృణమూల్ నేతలపైనే ఎక్కువ ఆరోపణలు వచ్చాయి. శారదా కుంభకోణంలో పాత్ర ఉన్న నేతలను వెంటనే అరెస్టు చేయాలంటూ 2017లో బీజేపీ కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించింది. అప్పటి నుంచి బీజేపీ బెంగాల్‌లో బలపడటం ప్రారంభమైంది. నిజానికి ఈ శారదా స్కాం 2013లో బయటపడింది. తృణమూల్ ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని నియమించి దర్యాప్తు చేయించింది. కానీ.. ఈ కేసును సుప్రీంకోర్టు ద్వారా సీబీఐ తన చేతుల్లోకి తీసుకుంది.
Also Read: కొత్త కరోనా ఎఫెక్ట్.. కర్ణాటకలో కర్ఫ్యూ అమల్లోకి..!
ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా ఉన్న ముకుల్ రాయ్, నిన్నామొన్న పార్టీలో చేరిన సువేందు అధికారి.. లాంటి వాళ్లు 2016లో నారదా న్యూస్ అనే చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో డబ్బులు తీసుకుంటూ దొరికిపోయారు. వారు బీజేపీలో చేరడంతో ఆ వీడియోల్ని .. యూ ట్యూబ్ నుంచి తొలగించారు. ఈ ఇద్దరే కాదు శారదా స్కాంలో పేరున్న ప్రతీ ఒక్క తృణమూల్ నేతను చేర్చుకోవడానికి బీజేపీ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. చివరికి తన వద్ద లంచాలు తీసుకున్న నేతలందరూ బీజేపీలో చేరిపోయారని జైలు పాలైన శారదా గ్రూప్ యజమాని విమర్శించడం ప్రారంభించారు. మొత్తంగా చూస్తే ఇన్నాళ్లు శారదా చిట్‌ఫండ్ మోసాలపై నిలదీసిన బీజేపీనే.. అందులోని దొంగలను చేరదీయడంపై ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌కు అస్త్రం దొరికినట్లైంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్