Russia Seeks China’s Help For Military Equipment: ప్రస్తుతం ఉక్రెయిన్ లో యుద్ధ మేఘాలు అలుముకున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలు ఎన్ని రకాలుగా రష్యాపై ఆంక్షలు విధిస్తున్నప్పటికీ.. పుతిన్ మాత్రం వెనక్కు తగ్గట్లేదు. ఈ క్రమంలోనే చైనాతో అమెరికా భేటీ కానుంది. రోమ్ నగరంలో సోమవారం ఇరుదేశాల భద్రతా సలహాదారులు ఈ మీటింగ్ కు హాజరవుతారు. ఈ మీటింగ్ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ఓ అధికారి సంచలన ఆరోపణలు చేశారు.

రష్యా చైనా సాయాన్ని కోరుతోందని.. సైనిక పరికరాలతో పాటు ఆయుధాలను ఇవ్వాలని చైనాను కోరినట్లు ఆ అధికారి సంచలన కామెంట్లు చేశారు. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో వెల్లడించింది. కాగా ఇప్పటికే రష్యాను చాలా దేశాలు ఆర్థికపరంగా ఆంక్షలు విధిస్తాం అంటూ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రష్యా చైనా సాయాన్ని కోరిందనే ఆరోపణలపై వాషింగ్టన్ లోని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి లీ పెంగ్యు స్పష్టత ఇచ్చారు.
ఉక్రెయిన్ లో ఉన్న భయంకర వాతావరణ పరిస్థితులను అడ్డుకోవడమే చైనా ముందున్న ప్రధాన కర్తవ్యమని తేల్చి చెప్పారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జాక్ సువెలిన్, చైనా విదేశాంగ విధాన సలహాదారుడు యాంగ్ జీచి రోమ్ నగరంలో భేటీ అవుతున్నారు. ఈ భేటీలో రష్యాకు సహకరించకుండా ఉండాలంటూ చైనాకు సూచించనుంది అమెరికా.
రష్యాకు చైనా సాయం చేయడాన్ని తాము అంగీకరించబోమని జాక్ సువేలిన్ ఈ భేటీకి ముందు వెల్లడించారు. ఒకవేళ చైనా సాయం చేస్తే కచ్చితంగా ఆర్థికపరమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రష్యా కు ఏ దేశం లైఫ్ లైన్ గా నిలిచిన కూడా.. తాము ఒప్పుకోబోమని జాక్ సువెలిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.