Chandrababu: చంద్రబాబు దూకుడుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నారు. ఎటువంటి వివాదాలు లేని నియోజకవర్గాల్లో అభ్యర్థిని డిసైడ్ చేసి పనిచేసుకోవాలని సూచిస్తున్నారు. అటు తన పర్యటనల్లో సైతం అభ్యర్థి పేరు ప్రకటించి.. గెలిపించాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిస్తున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు వరుస పర్యటనలతో బిజీగా ఉన్నారు. తాజాగా డోన్ నియోజకవర్గం లో పర్యటించిన ధర్మవరం సుబ్బారెడ్డిని గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనంది. బనగానపల్లెలో బీసీ జనార్దన్ రెడ్డి ఇన్చార్జిగా ఉన్నారు. ఆయనకు పోటీ లేకపోవడంతో క్యాండిడేట్ గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. నంద్యాలలో సైతం చంద్రబాబు పర్యటించనున్నారు. అక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా భూమా బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు. ఆయనకు పోటీగా భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఉన్నా బ్రహ్మానంద రెడ్డి వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. ఆయన పేరు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాలను చంద్రబాబు తిరుగుతున్నా.. ఆళ్లగడ్డ వైపు మాత్రం చూడడం లేదు. అక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా భూమా అఖిలప్రియ ఉన్నారు. ఆమెపై చంద్రబాబు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అక్కడ ఇన్చార్జిని మార్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు జిల్లాల పర్యటనలు సైతం పరిశీలిస్తే.. అభ్యర్థులుగా ఖరారైన నియోజకవర్గాలనే ఎంపిక చేసుకుంటున్నారు. అటువంటి నియోజకవర్గాలనే తిరుగుతున్నారు. ఇప్పుడు ఆళ్లగడ్డ జోలికి చంద్రబాబు వెళ్లకపోవడంతో.. వచ్చే ఎన్నికల్లో అఖిలప్రియకు టికెట్ దక్కే ఛాన్స్ లేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందుకు ఆమె స్వయంకృతాపమే కారణమని తెలుస్తోంది.