హైవే మీద చెక్‌పోస్ట్‌ల వద్ద రూ 48,000 కోట్ల దోపిడీ

జీఎస్టీ ని ప్రవేశ పెట్టడంతో `ఒకే దేశం – ఒకే పన్ను’ అమలులోకి వచ్చినదని, ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ ల పేరులతో పన్నుల బాదుడు ఉండబోదని నరేంద్ర మోదీ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ రహదారులపై ఒక వంక టోల్ గేటుల పేరుతో రూ 1 లక్ష కోట్లకు పైగా రుసుములను ప్రజల నుండి ప్రభుత్వమే దోపిడీ చేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా వాహనాల పన్నులు వసూలు చేస్తున్నా, […]

Written By: Neelambaram, Updated On : March 1, 2020 10:41 am
Follow us on

జీఎస్టీ ని ప్రవేశ పెట్టడంతో `ఒకే దేశం – ఒకే పన్ను’ అమలులోకి వచ్చినదని, ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ ల పేరులతో పన్నుల బాదుడు ఉండబోదని నరేంద్ర మోదీ ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ రహదారులపై ఒక వంక టోల్ గేటుల పేరుతో రూ 1 లక్ష కోట్లకు పైగా రుసుములను ప్రజల నుండి ప్రభుత్వమే దోపిడీ చేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా వాహనాల పన్నులు వసూలు చేస్తున్నా, రహదారుల నిర్వహణ బాధ్యతను మాత్రం చేపట్టకుండా పిపిపి పద్దతిలో అంటూ `జీవిత కాలం’ రహదారులపై టోల్ గేట్ రుసుములు వసూలు చేస్తున్నారు.

జీఎస్టీ రాకతో చెక్ పోస్ట్ లను ఎత్తివేసిన్నట్లు ప్రభుత్వం ప్రకటించినా లారీలను `నిలువు దోపిడీ’ చేస్తూనే ఉన్నట్లు వెల్లడైనది. హైవే మీద చెక్‌పోస్ట్‌ల దగ్గర లారీ డ్రైవర్లు, ఓనర్లు ‘కచ్చితంగా’ ఎంతో కొంత సమర్పించుకోవడం చూస్తూనే ఉంటాం. ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీవో అధికారుల బాదుడు దీనికి అదనం. ఇలా ఒక్కో ట్రిప్పునకు సగటున రూ.1,257 వసూలు చేస్తున్నారట.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌, బండి రిజిస్ట్రేషన్‌ సమయంలోనూ రూ.1500 వరకు మోత తప్పడం లేదు. దేశం మొత్తం ఉన్న లారీల డ్రైవర్లు, ఓనర్లు కలిసి ట్రాఫిక్‌, హైవే పోలీసులు, ఆర్టీవో అధికారులు తదితరులకు ప్రతి సంవత్సరం సమర్పించుకుంటున్న ఆమ్యామ్యాల మొత్తం అక్షరాలా రూ 48,000 కోట్లు అట. ‘సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ సర్వే చేసి తేల్చిన లెక్క ఇది.

దేశవ్యాప్తంగా ఉన్న పది భారీ రవాణా కేంద్రాలు (ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ ట్రాన్సిస్ట్‌ హబ్‌) పరిధిలో అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. సర్వేలో భాగంగా 1,217 మంది డ్రైవర్లు, 110 మంది యజమానులను సమగ్రంగా ప్రశ్నలు అడిగారు. ఈ నివేదికను కేంద్ర రవాణాశాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ ఇటీవలే విడుదల చేశారు. దీని ప్రకారం.

ప్రతి ట్రిప్పునకు లంచం ఇస్తున్నామని సగటున 82% శాతం మంది డ్రైవర్లు చెప్తున్నారు. ఈ జాబితాలో గువాహటి, చెన్నై, ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్నాయి. ఒక ట్రిప్పునకు సగటున చెల్లిస్తున్న మొత్తం రూ.1,257. నిబంధనల ప్రకారమే వెళ్తున్నా.. కొన్ని ప్రాంతాల్లో ఆర్టీవో అధికారులు వాహన రకాన్ని బట్టి ‘నిర్ణీత’ మొత్తం వసూలు చేస్తున్నారట. ఇలా ధరల పట్టిక అమలు చేస్తున్న హబ్‌లలో బెంగళూరు, గువాహటి టాప్‌లో ఉన్నాయి.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ సమయంలో ఆర్టీవో అధికారులకు లంచం ఇవ్వాల్సి వస్తున్నదని సగటున 47 శాతం మంది డ్రైవర్లు చెప్పారు. ముంబైలో ఏకంగా 93 శాతం మంది నుంచి, ఢిల్లీలో 78శాతం మంది నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారట. ఇలా లైసెన్స్‌ రెన్యువల్‌కు ఒక్కో డ్రైవర్‌ సగటున రూ.1,789 ముట్టజెప్తున్నారని తేలింది.

అత్యధికంగా ఢిల్లీలో రూ. 2,025 ముట్టజెప్పాల్సి వస్తున్నదని వాపోతున్నారు. అదేవిధంగా ట్రక్కుల రిజిస్ట్రేషన్‌ సమయంలో ఒక్కో వాహనానికి సగటున రూ.1,360 ముట్టజెప్పాల్సి వస్తున్నదని వాపోతున్నారు.