https://oktelugu.com/

టీ వెనక ఇంత చరిత్ర వుందా ?

అప్పుడే వారాంతం వచ్చింది. ఈవారంలో భారత్ లో రెండు పెద్ద సంఘటనలు జరిగాయి. ఒకటి అత్యంత వివాదాస్పద వ్యక్తి, అదేసమయంలో అత్యంత శక్తిమంతమైన అమెరికాకు అధ్యక్షుడు కూడా అయిన ట్రంప్ భారత్ రావటం వెళ్ళటం జరిగింది. దానితోపాటు ఇంకో పెద్దది ఢిల్లీలో జరిగిన అల్లర్లు. ఒకటి భారత్ ప్రతిష్ట పెరిగేదయితే,రెండోది భారత్ ప్రతిష్ట మంటగలిసేది. రెండూ ఈ వారంలోనే జరిగాయి. మొత్తం టీవీ లు , పత్రికలూ అన్నీ వీటిగురించే మాట్లాడుకుంటున్నాయి. మనంకూడా సెలవురోజుల్లోకూడా వాటిగురించి మాట్లాడుకుంటే […]

Written By:
  • Ram
  • , Updated On : February 29, 2020 / 09:46 PM IST
    Follow us on

    అప్పుడే వారాంతం వచ్చింది. ఈవారంలో భారత్ లో రెండు పెద్ద సంఘటనలు జరిగాయి. ఒకటి అత్యంత వివాదాస్పద వ్యక్తి, అదేసమయంలో అత్యంత శక్తిమంతమైన అమెరికాకు అధ్యక్షుడు కూడా అయిన ట్రంప్ భారత్ రావటం వెళ్ళటం జరిగింది. దానితోపాటు ఇంకో పెద్దది ఢిల్లీలో జరిగిన అల్లర్లు. ఒకటి భారత్ ప్రతిష్ట పెరిగేదయితే,రెండోది భారత్ ప్రతిష్ట మంటగలిసేది. రెండూ ఈ వారంలోనే జరిగాయి. మొత్తం టీవీ లు , పత్రికలూ అన్నీ వీటిగురించే మాట్లాడుకుంటున్నాయి. మనంకూడా సెలవురోజుల్లోకూడా వాటిగురించి మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది చెప్మా. ఇంకేదన్నా సరదాగా మాట్లాడుకుందామా. ఈసారి మనం మనం రోజూ తాగే టీ గురించి మాట్లాడుకుందాం.

    అసలు ఈ టీ ఎవడు కనిపెట్టాడోకానీ టీ తాగని వాళ్ళు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. చీనీ, జాపనీస్ వాళ్ళు మొదలుపెడితే దాన్ని ప్రపంచ వ్యాపారంగా మార్చింది బ్రిటిష్ కంపెనీలు. దానికి కార్యస్థానం మనభూభాగమేనండోయ్. అంతవరకూ బాగానేఉందికానీ ఈ టీ వలన అమెరికా కు స్వాతంత్రమే వచ్చిందని తెలుసా? టీమీద వేసిన పన్నులకు నిరసనే అమెరికా స్వాతంత్రానికి దారి తీసిందని తెలుసనుకుంటాను. కానీ ఇందులో చాలా మందికి తెలియని అంశం ఒకటుంది. దీనికి ఇండియా కనెక్షన్ ఉందని. అదేంటో తెలుసా ? భారత్ లోని పరిణామాలే ఆ పన్నులేయటానికి కారణం. మనదేశంతో వ్యాపారం చేయటానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ రాబర్ట్ క్లెయివ్ ఆధ్వర్యాన 1757 లో ప్లాసీ యుద్ధం, ఆ తర్వాత బక్సర్ యుద్ధం తో వ్యాపారసంస్థ నుంచి పాలనా సంస్థగా మారిందికదా. ఇది మనకు తెలిసిన చరిత్ర. తెలియనిదేమిటంటే ఈ యుద్ధాలతో ఈస్ట్ ఇండియా కంపెనీ దివాళా తీసే పరిస్థితి వచ్చింది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని ఎట్లాగైనా కాపాడాలని అనుకుంది. అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీ అమెరికాకు మనదేశం నుంచి టీ ని సరఫరా చేస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ కి ఆదాయం పెంచి దివాళానుంచి బయటపడేయాలంటే ఆ టీ పై సుంకాల్ని బ్రిటిష్ ప్రభుత్వం పెంచింది. ఇంకేముంది అప్పటికే రగులుతున్న అమెరికా ప్రజలకి మంచి ఆయుధం దొరికింది. మిగతా కధ మీ అందరికీ తెలిసిందే. ఇంతకీ దీని సారాంశమేమిటంటే ఈ టీ వలన బ్రిటిష్ ప్రభుత్వం అమెరికా లాంటి పెద్ద భూభాగాన్ని పోగొట్టుకుని ఇండియాని కాపాడుకుంది. మరిఈ టీ కి అంత శక్తి వుంది. బ్రిటిష్ లాంటి అత్యంత శక్తివంతమైన దేశాన్ని వణికించింది. కాబట్టి టీ ని తక్కువ అంచనా వేయకండి.

    ఇక ఇండియా కొస్తే మన టీ ప్రత్యేకం. పాలతో మరిగించి తయారుచేస్తాం. ఒకనాడు పెద్దవాళ్లకే పరిమితమైన ఈ టీ ఇప్పుడు అతి సామాన్యుడికి దివ్యఔషధం. అది తాగితేనే మనసుకు కిక్కు ఎక్కుతుంది. ఇంటికి పనిమనిషివచ్చినా ఏమిచ్చినా ఇవ్వకపోయినా టీ ఇవ్వాల్సిందే. ఇప్పుడిప్పుడే బ్లాక్ టీ, గ్రీన్ టీ తాగేవాళ్ళు పెరుగుతున్నా ఇప్పటికీ మన పాల టీ నే ఎక్కువమంది భారతీయులు ఇష్టపడతారు. ఇక్కడేకాదు అమెరికాకి వెళ్లినా , ఇంగ్లాండ్ వెళ్లినా ఇంట్లో మన పాల టీ నే తాగుతుంటారు. అదీ ఇండియా నుంచి దిగుమతిచేసుకున్న ఇండియా బ్రాండ్ టీ పొడినే వాడతారు. ఎందుకంటే పాలతో మరిగించే టీ ఆకును మన అస్సాం లోనే ఎక్కువగా పండిస్తారు. డార్జిలింగ్ వెరైటీ ఎక్కువగా బ్లాక్ టీ కి వాడతారు. అది ఖరీదు కూడా. ఒకవిధంగా చెప్పాలంటే అందరిదీ అస్సాం టీ, వున్నత వర్గాలది మాత్రమే డార్జిలింగ్ టీ కిందకి మారింది. అంతేకాదండి , ఇది ప్రాంతాల్ని బట్టి మారుతుంది.

    మొదటగా చెప్పుకోవాల్సి వస్తే అమెరికాలో అప్పటినుంచి కూడా టీ వాడకం తగ్గి కాఫీ వాడకం పెరిగింది. పొద్దున్నే స్టార్ బక్స్ కాఫీ వాళ్ళ దినచర్యలో భాగమైపోయింది. టీ అందుబాటులో వున్నా తాగే వాళ్ళ సంఖ్య బాగా తక్కువ. మరి కారణం తెలియదు. అలాగే లాటిన్ అమెరికా కూడా. ఇటీవలి కాలంలో జన్మస్థానమైన చైనా లోకూడా టీ ని కాఫీ డామినేట్ చేస్తుందంట. అదీ అమెరికా కంపెనీ అయిన స్టార్ బక్స్ శాఖలు విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. ఇక ఇండియాకొస్తే ఎందుకనో దక్షిణాదిలో పొద్దున్నే ఫిల్టర్ కాఫీ వాళ్ళ దినచర్యలో భాగం. అదే ఉత్తరాదిలో ఇప్పటికీ టీ అదీ పెద్ద గ్లాసుల్లో తాగాల్సిందే. మరి ఈ తేడా ఎందుకొచ్చిందో? కెసిఆర్ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర, తెలంగాణ సంస్కృతులు , వంటకాలు వేరని సోదాహరణంగా వివరించాడు. కానీ టీ, కాఫీ ల గురించి చెప్పటం మరిచిపోయాడు. ఆంధ్రాలో ఇప్పటికీ పొద్దున్నే కాఫీ అదీ ఫిల్టర్ కాఫీ తాగుతారు. కానీ హైదరాబాద్ లో, తెలంగాణాలో పొద్దున్నే ఇప్పటికీ టీ నే ఇష్టపడతారు. హైదరాబాద్ లో అయితే ఇరానీ చాయ్ అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎందుకనో కెసిఆర్ ఈ విషయం చెప్పటం మరిచిపోయాడు. ఎవరూ గుర్తు చేయలేదేమో లేకపోతే దీన్ని కూడా బ్రహ్మాడంగా వాడేసుకునేవాడు. ఎంతచెప్పినా కెసిఆర్ ఒరిజినల్ నాయకుడు, ప్రజల నాడిని పట్టగల మేధావని నిరూపించుకున్నాడు. కానీ టీ ప్రత్యేకత ని మిస్ అయ్యాడు. అయినా ఇప్పుడింకా వీటితో పనిలేదనుకోండి. అంటే అమెరికా దేశం స్వాతంత్రం పొందటంలోనే కాదు ఆంధ్ర , తెలంగాణ విభజన లో కూడా టీ ప్రత్యేకతని సంతరించుకున్నదన్నమాట.అంతెందుకండి టీ అమ్మిన మోడీ మన దేశానికి ప్రధానమంత్రే అయ్యాడు. చూసారా టీ మహత్యం. మనం టీ ని రోజూ తాగుతున్నామేకానీ దానికి ఇంత చరిత్ర ఉందని తెలిసిన తర్వాత తాగేటప్పుడు ఇకనుంచి టీ మహత్యం గుర్తుకొస్తుందనుకుంటా.

    ఇవీ ఈవారం ముచ్చట్లు, వచ్చే వారం మళ్ళీ కలుద్దాం, అంతవరకూ సెలవు
    …….. మీ రామ్