
మనిషికో రూ.వంద విరాళంగా ఇచ్చి పార్టీ ఫండ్ రూ.200 కోట్లు చేద్దామని పిలుపునిచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానిపై వివిధ మీడియా ఛానళ్లు, కొంతమంది పార్టీ పెద్దలు అదే పనిగా పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉన్న జగన్ పార్టీ నేతలు కూడా మరీ రెచ్చిపోతున్నారు. ఇంతకీ పవన్ అభిమాని చేసిన తప్పేంటంటే.. పార్టీకి రెండు వందల కోట్ల మేర విరాళం ఇవ్వాలని పిలిపునివ్వడం. నిరుద్యోగుల నుంచి అక్షరాల రూ.200 కోట్ల వసూళ్లు చేసినట్లు చేసిన జగన్ సర్కార్ కంటే ఇది పెద్ద నేరమేమి కాదు. అయినా ఆ అభిమాని పిలుపును ఇంత రాద్ధాంతం చేయడం అర్థంలేని వాదన. ప్రజలను మభ్యపెట్టి రూ.200 కోట్లు వసూల్ చేసిన జగన్ ప్రభుత్వ అధికారులు చేసిన దానికంటే.. జనసేన కార్యకర్త చేసిన తప్పు చాలా చిన్నదనేది కొంత మంది విశ్లేషకుల అభిప్రాయం. కేవలం నిరుద్యోగుల నుండి పెద్ద మొత్తంలో వసూల్ చేసిన జగన్ సర్కార్ తప్పిదాన్ని డైవర్ట్ చేయడానికి వైస్సార్సీపీ నేతలు ఇటువంటి జిమ్మిక్కులు లాజిక్కులు చేస్తుంటారు అనేది అనేకమంది అభిప్రాయం.
గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ పెద్ద ఎత్తున వైస్సార్సీపీ ప్రభుత్వం పై విరుచుకుపడింది. ఆ సమయంలో సాక్షాత్తు సీఎం జగన్ రంగప్రవేశం చేసి పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా విమర్శించారు. నీ భార్యల పిల్లలు ఏ పాఠశాలలో చదువుతున్నారని జగన్ అన్నారు. అప్పుడు ఇంగ్లీష్ మీడియం సమస్య ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ వైపు తిరిగింది. ఇప్పుడు కూడా వైస్సార్సీపీ నేతలు అదే చేస్తున్నారు. వారి పాలనలో జరిగిన రూ.200 కోట్ల స్కాం ని జనసేన అభిమాని పై తిప్పి వారి పాలనలో జరిగిన తప్పిదాన్ని కప్పి పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
రూ.200 కోట్ల వ్యవహారం ఇదే..
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే విద్యుత్ సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు పడ్డాయి. దాదాపు 12000 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే పర్మినెంట్ అవుతుందని.. జీతం బాగుంటుందని.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతామని తెలిసి నిరుద్యోగులు ఎగబడడంతో కొందరు ఎమ్మెల్యేలు దీన్ని క్యాష్ చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో కొలువును రూ.10లక్షలకు అమ్ముకున్నారని.. 5వేల మంది నుంచి డబ్బులు కలెక్ట్ చేశారని అంటున్నారు. మొత్తం రూ.200 కోట్ల వరకు ఈ వసూళ్లు జరిగాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ వసూళ్ల బాగోతాన్ని సీఐటీయూ కార్మిక అనుబంధం సంఘం యూనైటెడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. ఒక్కో పోస్టుకు 10లక్షల చొప్పున రూ.200కోట్లు వసూలు చేశారని ఆరోపించింది. ఈ విషయం సీఎం జగన్ కు తెలియడంతో పోస్టుల భర్తీని నిలిపివేయాలని ఆదేశించారు.
అయినా ఒక్కో నిరుద్యోగి నుంచి వసూలు చేసిన రూ.10లక్షలను శాసనసభ్యులు తిరిగి ఇవ్వలేదని సమాచారం. పోస్టులు భర్తీ చేస్తామంటూ డబ్బులు తీసుకున్న వారిని ఏమారుస్తున్నారని వినికిడి.ఈనేపథ్యంలో నిరుద్యోగుల నుంచి సదరు ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరగడంతో వారు అధికారుల మెడపై కత్తులు పెట్టి తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు.నెల్లూరు జిల్లాలో ప్రస్తుతమున్న పదిహేను మంది షిఫ్ట్ ఆపరేటర్లను తొలగించి ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారిని నియమించడంతో ఉద్యోగాలు కోల్పోయిన వారు రోడ్డెక్కి ఆందోళన చేయటంతో ఈ ఆమ్యామ్యాల వ్యవహారం మళ్లీ రచ్చకెక్కింది.
సిఎం జగన్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నా, నియామకాలను నిలిపివేసినా శాసనసభ్యులు వెనక్కు తగ్గడం లేదు.ఉన్న వాళ్లను సైతం తీసేసి తమకు డబ్బులిచ్చిన వారిని ఆ ఉద్యోగాల్లో నియమించిన వ్యవహారం నెల్లూరు జిల్లాలో జరగడంతో విషయం రచ్చకెక్కింది. అవినీతిని సహించేది లేదంటున్న ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.