
తెలంగాణ కరోనాతో ప్రజలు ఇబ్బందుల దృష్టిల్లో ఉంచుకొని తెల్లరేషన్ కార్డుదారులకు రూ.1500 పంపిణీ చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,112కోట్ల రూపాయాల నిధులను సమకూర్చింది. సోమవారమే ఈ నిధులను ఎస్బీఐ బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. మంగళవారం అంబేద్కర్ జయంతి బ్యాంకులకు సెలవు కావడంతో బుధవారం నుంచి రేషన్ కార్డు దారుల బ్యాంకు ఖాతాల్లో రూ.1500 జమ కానున్నాయి.
రాష్ట్రంలోని 87.59లక్షల తెల్లకార్డులు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. వీటిలో 74లక్షల పైచిలుకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు క్లియర్‌గా ఉన్నాయని చెప్పారు. రేషన్ కార్డుకు మ్యాపింగ్ అయిన బ్యాంక్ ఖాతాల్లో రూ.1500 నగదు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఆధార్ నంబర్‌తో మ్యాపింగ్ ఉంటే ‘యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ సిస్టమ్’ ద్వారా చివరి ట్రాన్సాక్షన్ ఏ అకౌంట్‌తో చేస్తే ఆ అకౌంట్లో నగదు జమ అవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని మంగళవారం మంత్రి కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా రేషన్‌కార్డుతో ఆధార్ సీడింగ్ అయి, బ్యాంకు అకౌంట్ నెంబర్ లేనివారికి రెండో దశలో పౌరసరఫరాల శాఖ డబ్బులు పంపిణీ చేయనుంది.