మా సంపాదకీయాల్లో ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించాము. జగన్ మోహనరెడ్డికి ఆంధ్రలో ఏమైనా గండముంటే అది మత వివాదమే అవుతుందని అంచనా వేశాము. దానికి కారణం కూడా చెప్పాము. జగన్ మోహన రెడ్డి, ఆయన కుటుంబం క్రైస్తవ మతాన్ని పాటించటం, ఆంధ్రలో గత కొద్ది కాలంగా ( జగన్ అధికారంలోకి రాక ముందునుంచే) మత వివాదం వుండటం ఇవి తన హయాంలో ఇంకా సున్నితంగా తయారయ్యే అవకాశం వుందని అంచనా వేసాము. మా అంచనా కరెక్టని తేలింది.అదేసమయంలో జగన్ కూడా మతపరమైన అంశాల్లో అతిగా జోక్యం చేసుకోవటం కూడా వికటిస్తుంది. అశోక్ గజపతిరాజు మీద కోపంతో ఆయన్ని సింహాచలం దేవస్థానం నుంచి తొలగించి ఆయన అన్న కుమార్తెను నియమించటం, ఇప్పుడు రామతీర్ధం గొడవల్ని అడ్డంపెట్టుకొని అశోక్ గజపతిరాజుని మూడు ట్రస్టుల్లోంచి తొలగించటం ఇంకో తప్పు. అశోక్ గజపతి రాజు తెలుగుదేశం నాయకుడిగా వుండటం వలన ఆ ట్రస్టుల్లో లేడని గమనించాలి. అలాగే జగన్ మోహన రెడ్డి స్వయంగా ఇటువంటి పనులను ప్రోత్సహించకపోయినా ఆయన వెనకనున్న వాళ్ళందరూ అలానే వున్నారని చెప్పలేము. దానికి కారణం ఆయన సామాజిక బేస్ ని ఒక్కసారి పరిశీలిస్తే అర్ధమవుతుంది. అందుకే జగన్ కి మత గండం వుందని మేము ఊహించాము. దీనిపై ఇంకొంచెం లోతుగా పరిశీలిద్దాం.
ఈ దాడుల వెనక అసలు కారణాలేమిటి?
ఒక్కసారి ఆంధ్ర సామాజిక, చారిత్రిక నేపధ్యాన్ని చూస్తే దీని మూలాలు అర్ధమవుతాయి. ఆంధ్రా ప్రాంతం మద్రాస్ ప్రావిన్స్ లో వుండి బ్రిటీష్ పరిపాలన కింద వుండేది. క్రైస్తవ మిషనరీలు వుమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మత విస్తరణ చేసారు. తమిళనాడు, ఆంధ్రల్లో ఈ మిషనరీలు హిందువుల్ని మతమార్పిడి చేయటంలో చాలా పురోభివృద్ధి సాధించారు. ముఖ్యంగా దళితుల్లో నూటికి తొంభై శాతం పైగా క్రైస్తవంలోకి మారారు. అలాగే రాయలసీమ, పల్నాడు లాంటి ప్రాంతాల్లో మిగతా కులాల్లో కూడా వాటి ప్రభావం విస్తృతంగా వుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ మత మార్పిడులు ఆగలేదు. మనకు కొట్టొచ్చినట్లు కనబడేది ఉత్తరాంధ్ర మన్య ప్రాంతం. ఒకనాడు వాళ్ళందరూ వాళ్ళ స్థానిక మతాచారాలను పాటించేవారు. గత మూడు దశాబ్దాలలో మన్యప్రాంతంలో వున్న ఆదివాసులందరూ క్రైస్తవానికి మారారు. అంటే ఈ రోజు ఆంధ్రలో ఒక అంచనా ప్రకారం 20 నుంచి 25 శాతం దాకా ప్రజలు క్రైస్తవులని చెబుతున్నారు. ఎంతతక్కువ వేసుకున్నా 15 నుంచి 20 శాతం వరకూ క్రైస్తవ జనాభా వుంది. కాని జనాభా లెక్కల్లో మాత్రం కేవలం 2 శాతమే వున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
గణనీయంగా క్రైస్తవ మతస్తులు వుండటంతో బాటు క్రైస్తవ మిషనరీల ప్రచారం ఇప్పటికీ వుధ్రతంగానే వుంది. ఆంధ్రలో అనేక గ్రామాల్లో ఈ ప్రచారం, మార్పిడులు నిరంతరం కొనసాగుతున్నాయి. ఇదే ధోరణి తమిళనాడులో కూడా వుంది. వీళ్ళు హిందూ దేవుళ్ళను అగౌరవంగా మాట్లాడటం, హిందూ గ్రంధాల్ని చులకన చేసి అవహేళన చేయటం కూడా ఎప్పట్నుంచో జరుగుతూ వుంది. ఇది గ్రామాల్లో వుండే వారికి కొత్త విషయమేమీ కాదు. చర్చీలనుండి మత ప్రవక్తలు చేసే ప్రసంగాలు బైబుల్ నుంచి గురించి ప్రచారం చేసుకోవటంతోపాటు, హిందూ మత దూషణ సర్వ సాధారణం. పల్లెటూళ్ళలో నివసించేవారికి ఈ మాటలు మైకుల్లో మారుమోగటం ఎన్నో దశాబ్దాలనుంచి జరుగుతూనే వుంది. దాంట్లో భాగమే తిరుమలలో అన్యమత ప్రచారం కూడా. ఈ దేశంలో చాపకింద నీరులాగా మత మార్పిడులు ఇదివరకు జరిగినా, ఇప్పుడు జరుగుతున్నా అది హిందూ మతం నుంచి క్రైస్తవానికే. పత్రికలూ, చానళ్ళు హిందూ-ముస్లిం గొడవల మీద ప్రతిరోజూ ఏదో ఒకవార్త వండి వారుస్తూ వుంటాయి గాని ఈ మత మార్పిడుల గురించి పల్లెత్తు మాట మాట్లాడవు. మతమార్పిడులు, మత ప్రచారంతో పాటు హిందూ మతంపై దూకుడుగా వ్యవహరించటం పరిపాటయ్యింది. అది వాళ్ళు పవిత్ర కర్తవ్యంగా భావిస్తున్నారు కాబట్టి నిబద్దతతో చేస్తూ వుంటారు. అందులో భాగమే విగ్రహారాధనపై ద్వేషం కూడా. ఇవన్నీ ఎప్పట్నుంచో జరుగుతున్నాయి. ఆ నేపధ్యాన్ని అర్ధం చేసుకోకుండా మనం రాజకీయ కోణం నుంచే చూస్తే పరిష్కారం దొరకదు. ఈ మత దూషణ ప్రచారం ఎన్నో దశాబ్దాలనుంచి జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు గుడ్లప్పగించి చూసినవారిలో కాంగ్రెస్, వైఎసార్ సి పి, తెలుగుదేశం ముగ్గురికీ సమాన బాధ్యత వుందని గుర్తుంచుకోవాలి. ఇందులో వీళ్ళందరూ ఆ తాను ముక్కలే. ఈ కోణం నుంచి ఆలోచించి పరిష్కారం కనుక్కోకపోతే ఇవి ఇంతటితో ఆగిపోతాయని అనుకోవటంలేదు.
కిం కర్తవ్యం?
జగన్ మోహన రెడ్డికి ముఖ్యమంత్రిగా గురుతర బాధ్యత వుంది. వీటిని అరికట్టాల్సిన బాధ్యత తన భుజస్కందాలపై వుంది. అదీ తను అన్యమతస్తుడు కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా ప్రతిస్పందించాల్సివుంది. ఇంతవరకూ వరసగా జరుగుతున్న ఈ దాడుల వెనక ఎవరున్నారనేది కనిపెట్టలేక పోవటం పెద్ద వైఫల్యమే. సహజంగానే ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. నిజంగా దీనివెనక క్రైస్తవ ప్రచారకులు వుండి వుంటే వాళ్ళను గుర్తించి దోషులుగా నిలబెట్టాలి. వాళ్ళు తన మద్దత్తు దారులైనప్పటికీ. అప్పుడే తన మీద విశ్వాసం ఏర్పడుతుంది. అదికాకపోయినట్లయితే రాజకీయంగా తనని దెబ్బతీయటానికి కుట్ర పన్ని వుంటే వాళ్ళనైనా బయటపెట్టాలి. తను ముఖ్యమంత్రిగా శాంతి భద్రతలను పర్యవేక్షించే అత్యున్నత అధికారిగా, మెజారిటీ మతస్తుల మనోభావాల్ని దెబ్బతినకుండా చూడాల్సిన గురుతర బాధ్యత కూడా తనపై వుంది. ఆ విశ్వాసం ప్రజలకి కలగాలంటే దోషుల్ని పట్టుకోగలగాలి. శిక్షించాలి. లేకపోతే తను ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు. ముఖ్యంగా మత అంశాల్లో ఉద్రిక్తతలకు తావివ్వటం సాధారణం. దీనిపై ఎంత త్వరగా దోషుల్ని పట్టుకోగలిగితే అంత మంచిది. లేకపోతే ఇది చిలికి చిలికి గాలివాన కావటం ఖాయం.