Minister Dharmana Prasada Rao: విశాఖ నగరంలో శివారు కాలనీల ప్రజలు మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా సరైన రహదారులు లేక అసౌకర్యానికి గురవుతున్నారు. మా కాలనీకి రహదారి నిర్మించండి మహాప్రభో అంటూ జీవీఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ వారు పెడచెవిన పెడుతున్నారు. కానీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు చెందిన భూమి కోసం ఏకంగా 60 అడుగుల రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏకంగా 16 లక్షల రూపాయల జీవీఎంసీ నిధులు వెచ్చించి రోడ్డు నిర్మిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ లో ఉందని చెబుతూ.. ఆ భూమి వెలువ పెరిగేలా రోడ్డు పనులు చేపడుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మధురవాడ సర్వేనెంబర్ 187 /1 లో ధర్మాన ప్రసాదరావుకు 4.89 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని మాజీ సైనికుడికి ప్రభుత్వం కేటాయించింది. అమ్మకానికి ఎన్ఓసి ఇవ్వాలని ధర్మాన ప్రసాదరావు రెవిన్యూ మంత్రిగా ఉండే సమయంలో సదరు మాజీ సైనికుడు భార్య దరఖాస్తు చేసుకుంది. అప్పట్లో ఆగమేఘాలపై ఎన్ఓసీ జారీ చేయడం వెనుక ధర్మాన ప్రసాదరావు ఉన్నారన్న ప్రచారం సాగింది. అటు తరువాత అదే భూమిని ధర్మాన కుమారుడి కంపెనీ పేరిట కొనుగోలు చేయడం అనుమానాలకు మరింత బలం చేకూరింది. దీనిపై అప్పట్లో దుమారం రేగింది. ప్రభుత్వాలు మారిన తర్వాత అంతా సైలెంట్ అయ్యింది.
ఇప్పుడు అదే భూమి కోసం ఏకంగా 60 అడుగుల రోడ్డు నిర్మాణం చేపడుతుండడం విశేషం. మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీ నుంచి సదరు స్థలం వరకు 60 గల రోడ్డు నిర్మాణాన్ని వీఎమ్ఆర్డిఏ అధికారులు మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచారు.మంత్రి ప్రోత్సాహంతో నే ఈ రహదారిని మాస్టర్ ప్లాన్లు ప్రతిపాదించినట్లు ఆరోపణలు వచ్చాయి. అసలు ఇక్కడ రహదారి అవసరమే లేదు. అయినా జీవీఎంసీ అధికారులు పట్టు పట్టి మరి రోడ్డు ఏర్పాటు చేస్తుండడం విశేషం.
ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీనికిగాను జీవీఎంసీ 16 లక్షల రూపాయలును కేటాయించింది.తుప్పల తొలగింపు, కచ్చా రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. రెండు మూడు రోజుల్లో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. కేవలం మంత్రి ధర్మాన భూమిని విలువ పెంచేందుకే జీవీఎంసీ అధికారులు పనులు చేపట్టారు అనే విమర్శలు విశాఖలో వ్యక్తం అవుతున్నాయి.