ఇప్పుడు కరోనా కల్లోలం సృష్టిస్తోంది దేశంలో. దీనికితోడు ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఆక్సిజన్ బాబోయ్ అంటూ రోగులు కొట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ దేశంలో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి. కరోనా పేషెంట్లకు సకాలంలో ఆక్సిజన్ అందించలేని దుస్థితి వచ్చింది. ఇలాంటి క్లిష్ట సమయంలో కేంద్రం కూడా ఏమీ చేయలేకపోతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం నెత్తిన చేతులు పెట్టుకొని చూస్తున్నాయే తప్ప ఆదుకునే ఆలోచనలు రావడం లేదు.
ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ముందుకు వచ్చింది. మనుషుల ఆయువు నింపేందుకు ప్రాణవాయువు అందించేందుకు సిద్ధమైంది. స్టీల్ ప్లాంట్‌లో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా పెద్ద ఎత్తున ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోంది. ఎక్కడెక్కడ అవసరముందో అక్కడికి పంపుతోంది. ట్యాంకర్లలో నింపి.. రైళ్ల ద్వారా మహారాష్ట్రకు సైతం అందిస్తూ ఆయువు నింపుతోంది. ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ మనుషుల ప్రాణాలను నిలబెడుతూ మరోసారి తానేంటో నిరూపించుకుంది విశాఖ స్టీల్ ప్లాంట్.
ప్లాంట్ సిబ్బంది రేయింబవళ్లు ఆక్సిజన్ ప్రొడక్షన్ కోసమే తండ్లాడుతున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సర్వత్రా ప్రయత్నాలు సాగిస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి అవసరాల దృష్ట్యా రెగ్యులర్‌గా లిక్విడ్ ఆక్సిజన్‌ను తయారు చేస్తుంటారు. ఇలా ఇక్కడ ఐదు ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ సందర్భంలోనూ ఈ ప్లాంట్ నుంచి భారీ స్థాయిలో ఆక్సిజన్ తయారు చేసి సరఫరా చేశారు. రోజుకు 100 టన్నుల చొప్పున తయారు చేసి.. వారం రోజుల్లో 700 టన్నులకు పైగా ఆక్సిజన్‌ను అందించారంటే ఆ ప్లాంట్ గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఈ ప్లాంట్‌లో రోజుకు రెండున్నర వేల టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను తయారుచేసే కెపాసిటీ ఉంది. ఒకవేళ నిజంగానే దేశవ్యాప్తంగా ఆక్సిజన్ షార్టేజీ పెరిగిపోయిందనుకుంటే స్టీల్ ప్రొడక్షన్ నిలిపివేసి.. ఆక్సిజన్ ప్రొడక్షన్‌కు ప్రాధాన్యం ఇచ్చే అవకాశమూ ఉంది. అయితే.. ఆ ఆక్సిజన్ను సరఫరా చేసే మౌలిక సదుపాయాలు కూడా అందుకు కావాలి. కానీ.. ఈ ప్లాంట్‌లో అలాంటి సదుపాయాలు లేవు. అందుకే.. అంత స్థాయిలో ఆక్సిజన్ తయారు చేసే వీలు లేకుండా పోయింది.