నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులో ట్విస్ట్ లు లెక్కకు లేనన్ని వస్తున్నాయి. సినిమా కథను తలపించేలా కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రఘురామ ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. పోలీసుల తీరుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వారిని రాక్షసులుగా భావించారు. మూర్ఖులుగా నిందించారు. వారిలో మంచినే చూడాలని హితవు పలికారు. ఇవన్నీ చూస్తుంటే ఇదో సినిమా కథగా అనిపిస్తోంది కదూ. ఎప్పుడు వార్తల్లో ఉండే రాంగోపాల్ వర్మ ఈ సారి రఘురామను ఎంచుకున్నారు. ఆయనపై సానుభూతి ప్రకటిస్తూ పోలీసులను నానా విధాలుగా నిందించారు.
రెండు వారాలుగా ఏపీ ప్రభుత్వ తీరు, సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ రఘురామ కృష్ణం రాజు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కొందరు నేతలు రఘురామపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించడం వివాదాస్పదమైంది. సీఐడీ పోలీసులు కావాలనే దాడి చేశారని వర్మ ఆరోపించారు. ఎంపీని అరెస్టు చేసి కొట్టడంపై ఆయన కుటుంబం సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేయడం తరువాత ఎంపీకి బెయిల్ మంజూరు చేయడం జరిగిపోయాయి.
లాక్ డౌన్ సమయంలో పోలీసులతో దెబ్బలు తిన్న వారంతా రఘురామను ఆదర్శంగా తీసుకోవాలని వర్మ పేర్కొన్నారు. పోలీసులు తల్లుల లాంటి వారు అని చెప్పారు. మన మితిమీరిన ప్రవర్తన వల్ల కొట్టలేదు. కేవలం మనపై ప్రేమ చూపించడానికే కొడతారు అని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. పోలీసుల చేతిలో ఎవరైనా దెబ్బలు తంటే రఘురామ లాంటి కేసులు ఫైల్ చేయాలని అనుకునే వాళ్లకు సలహా ఇచ్చారు. పోలీసుల లాఠీ దెబ్బలు ప్రేమతో వేసిన దండలు లాంటివని చెప్పారు. వారు తిట్టే తిట్లు మంచి కోరి వేసే మంత్రాల లాంటివని అభివర్ణించారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని మూర్ఖులు పోలీసుల చేతిలో తన్నులు తినడం, లాఠీ దెబ్బలు, వారిచే ముద్దులు పెట్టుకోవడానికి అర్హులు అంటూ ట్వీట్లు చేశారు.