
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ ఊహించని స్థాయిలో భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తుండటంతో కేసుల సంఖ్య తాత్కాలికంగా తగ్గినా నిబంధనలు సడలిస్తే మాత్రం కేసులు తప్పనిసరిగా పెరిగే అవకాశం ఉంది. అయితే పిల్లలపై మాత్రం వైరస్ ప్రభావం పెద్దగా లేదు.
శాస్త్రవేత్తలు మాత్రం థర్డ్ వేవ్ లో వైరస్ పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉంటాయని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పదేళ్లలోపు వయస్సు ఉన్న 2.9 శాతం చిన్నారులు మాత్రమే వైరస్ బారిన పడ్డారు. కరోనా సోకిన పిల్లల్లో సైతం లక్షణాలు ఎక్కువగా కనిపించడం లేదు. మరోవైపు చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ పై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తుండటం గమనార్హం.
ఎయిమ్స్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యల ప్రకారం కరోనా థర్డ్ వేవ్ వచ్చినా పిల్లలపై వైరస్ ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పిల్లలకు సంబంధించి నమోదవుతున్న కరోనా నిర్ధారణ కేసుల్లో ఎక్కువ కేసులు తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల నుంచి సోకుతున్న కేసులే కావడం గమనార్హం. పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండటం వల్లే వాళ్లు వైరస్ బారిన పడే అవకాశాలు తగ్గుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కరోనా బారిన పడిన వాళ్లలో ఎక్కువమందిలో అసలు లక్షణాలే కనిపించకపోవడం గమానార్హం. పిల్లలకు కరోనా సోకినా వాళ్లలో శాచురేషన్ డౌన్ కాకపోవడం, సీటీ విలువల్లో పెద్దగా మార్పులు లేకపోవడం గమనార్హం. థర్డ్ వేవ్ వచ్చినా పిల్లల శ్వాసకోశాలపై ప్రభావం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.