
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే తనదైన మార్కు రాజకీయం చేస్తున్నారు. అధ్యక్ష పదవి అధిరోహించే సమయాన్ని తనకు అనుకూలంగా చేసుకుంటున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అందరిని ఆహ్వానిస్తున్నారు. పొరుగు రాష్ర్టంలో కూడా పర్యటించి అందరిని పిలుస్తున్నారు. అధ్యక్ష పదవి చేపట్టే ఘట్టాన్ని ఆర్భాటంగా చేయాలని చూస్తున్నారు.
రేవంత్ రెడ్డి ఇప్పటికే సీనియర్లను కలిశారు. తన నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలను సైతం కలిసి వారికి స్వాగతం పలికారు. వారిని బుజ్జగిస్తూ కార్యక్రమానికి రావాలని సూచించారు. ఇవాళ కర్ణాటక వెళ్లి అక్కడి వారిని సైతం ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కోరుతున్నారు. బెంగుళూరు విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
అనంతరం కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ వద్దకు వెళ్లి కలిశారు. అక్కడి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించి ఆహ్వానించారు. మాజీ సీఎం సిద్దరామయ్యను కూడా ఆహ్వానించారు. తాజా పరిణామాలపై చర్చించారు. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టే కార్యక్రమానికి ఢిల్లీ నుంచి ఎవరు వస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు పెద్దమ్మతల్లి ఆలయంలో అమ్మవారికి పూజలు చేస్తారు. అనంతరం నాంపల్లిలోని దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్ లో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఇందుకోసం గాంధీభవన్ లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.