
కరోనా భయంతో, లాక్ డౌన్ అమలుతో దేశీయ విమానయాన రంగం కుదుపుకి గురైంది. ఈ రంగానికి ఇప్పటివరకు రూ.66వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, ప్రతి నిమిషానికి 3.77 కోట్లమేర నష్టం వస్తుందోదని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ (ఐఏటిఏ) అంచనా వేస్తోంది. ప్రయాణికుల డిమాండ్ 36% క్షీణించడంతో ఆదాయాలు 880 కోట్ల డాలర్లు లేదా రూ.66 వేల కోట్లు పడిపోతాయని అంచనా వేసినట్లు ఐఏటిఏ ఆసియా పసిఫిక్ ప్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ ఆల్బర్ట్ జోయెంగ్ అన్నారు.
మార్చి చివరి వారంలో ప్రారంభమైన నష్టం ఏప్రిల్ ప్రథమార్థం వరకు కొనసాగింది. లాక్ డౌన్ కొనసాగింపు నేపథ్యంలో ఇంకా కొనసాగుతోంది. దదీంతో ఇప్పటి వరకు విమానయాన రంగం 314 బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయింది.
కరోనా కారణంగా విమానయానం, అనుబంధ రంగాల్లో 20 లక్షలకు పైగా ఉద్యోగాలకు ముప్పు ఉన్నదని ఐఏటిఏ అంచనా వేసింది. ఇప్పటికే 11 వేలమందికి పైగా ఉపాధి కోల్పోయారని తెలిపింది.
భారీ సంక్షోభంలో వేతనాల్లో కోత, ఉద్యోగాల తొలగింత వరకు వెళ్లిందని ఐఏటిఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే చాలా సంస్థలు వేతనాలులేని సెలవులు ఇచ్చాయని గుర్తుచేసింది. ప్రస్తుతం కార్గో విమానాలు మినహా ప్యాసింజర్ విమానాల కార్యకలాపాలు లేవు.
ఈ క్రమంలో లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని తెలిపింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఐఏటిఏ కోరింది.