Kodangal fight: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కొడంగల్ పట్టణంలో ఆయన బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయితే ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా హాట్ చర్చ జరుగుతోంది.
సెంటిమెంట్‌గా..
కొండల్ వాసులను ఓన్ చేసుకునేందుకు రేవంత్‌రెడ్డి ‘మీ ఆశీర్వాదమే అండగా.. మీరిచ్చిన బలంతో ఈ కొడంగల్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ప్రాంతం పేరు నిలబెట్టా. కొడంగల్ సమాజమంతా కూర్చుని ఆలోచన చేయాలి’ అని కోరారు. తెలంగాణ రాజకీయాల్లో ఇంత గొప్ప అవకాశం కొడంగల్‌కు వచ్చిందని, మీ ఆశీర్వాదంతోనే తనకు పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందని, కొడంగల్‌లో ప్రతీ బిడ్డ కాంగ్రెస్‌కు అధ్యక్షుడే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మీ అందరిపై ఉందని తెలిపారు.
కొడంగల్‌కే రాష్ట్ర సారథ్యం..
ఇక రేవంత్ కొడంగల్ సభలో చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. కొడంగల్ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పగ్గాలు కొడంగల్ బిడ్డకు దక్కాయని, మీ ఆశీర్వాదంతో త్వరలో రాష్ట్ర సారథ్యం కూడా కొడంగల్ బిడ్డకే దక్కుతుందని పరోక్షంగా తాను సీఎం కాబోతున్నట్లుగా ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కృష్ణా రైలేలైన్, జూనియర్, జీపీ కాలేజీలు, కృష్ణా జలాలు తీసుకువస్తానన్నారు. నాడు కేసీఆర్ ఇవన్నీ చెప్పారని, ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఐదేళ్లలో కొడంగల్‌కు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేచ్చలేదని తెలిపారు. హామీ ఇచ్చి నెరవేర్చని బీఆర్‌ఎస్ నాయకులను నిలదీయాలని పిలుపు నిచ్చారు.
అన్నీ ఆ మూడు నియోజకవర్గాలకే..
ఇక రేవంత్ తెలంగాణలో అభివృద్ధి అంటే సిరిసిల్ల,సిద్దిపేట, గజ్వేల్ అన్నట్లుగా మారిందన్నారు. ఆ మూడు నియోజకవర్గాల్లా కొడంగల్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే కొండగల్ ప్రజలను కేసీఆర్ దగా చేశాడని ఆరోపించారు. దత్తత ఉత్తదే అయిందని, దమ్ముంటే కేసీఆర్ ఈసారి కొడంగల్ నుంచి పోటీ చేయాలని సవాల్ చేశారు.
కొడంగల్ ప్రజలు.. కేసీఆర్ మధ్య పోటీ..
ఈ ఎన్నికలు కొడంగల్ ప్రాంత ప్రజలకు.. కేసీఆర్ కు మధ్య జరుగుతున్నాయని రేవంత్ అన్నారు. ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదు.. ఇక్కడి ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే ఎన్నికలని తెలిపారు. దేశ ముఖ చిత్రంలో కొడంగల్‌కు ఒక గుర్తింపు తెచ్చే ఎన్నికలని పేర్కొన్నారు. గ్రూపులు, గుంపులు కాదు.. కొడంగల్ అంతా కలిసి రావాలి… కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ఏకగ్రీవ తీర్మానం చేయాలని కోరారు.
చీలిపోతే కూలిపోతాం..
గత ఎన్నికల తరహాలో ఈసారి కూడా చీలిపోతే జీవితాలు ఆగమవుతాయని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో కర్ణాటక కంటే గొప్ప తీర్పు కొడంగల్ ప్రజలు ఇవ్వాలని కోరారు. కర్ణాటకలో డీకే శివకుమార్ కంటే ఎక్కువ మెజారిటీతో కొడంగల్‌లో కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. గెలిచిన రెండేళ్లలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పూర్తి చేసి నీళ్లు తీసుకొస్తానని చెప్పారు. ఏడాదిలో మహబూబ్ నగర్ చించొలి జాతీయ రహదారి పూర్తి చేయిస్తానన్నారు. తనకు అండగా నిలబడితే.. కొడంగల్ ఆత్మగౌరవాన్ని నిలబెడతానని తెలిపారు.