Ramoji Rao : ‘రామోజీ మరో ఫిర్యాదు సంచలనమైంది. అసలు మార్గదర్శి అన్న చిట్ ఫండ్ రామోజీదే కాదని కొంతమంది ఆరోపించారు. తమది లాక్కున్నాడని ఆరోపించారు. ఇప్పుడు ఆయన వారుసులు కోర్టుకు ఎక్కడంతో అదే నిజమని తేలింది. మార్గదర్శి కేసులో మరో కొత్త ట్విస్ట్ బయటకొచ్చింది. ఈసారి ఏకంగా రామోజీరావు పైనే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైంది. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరగనుంది. అయితే ఈసారి మార్గదర్శి విషయంలో సరికొత్త కోణంలో ఫిర్యాదు అందింది. తన పేరుతో ఉన్న షేర్లను బలవంతంగా రాయించుకున్నారని ఆరోపిస్తూ యూరి రెడ్డి అనే వ్యక్తి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం విశేషం. దీంతో ఇది తెలుగు నాట సంచలనంగా మారింది.
ఇంతకీ ఈ యూరి రెడ్డి ఎవరంటే… మార్గదర్శి వ్యవస్థాపకుడు జగన్నాథరెడ్డి కుమారుడు. ఆయన తదనంతరం మార్గదర్శిలో తమకు రావాల్సిన వాటాల కోసం వెళితే.. రామోజీరావు తుపాకీతో బెదిరించి బలవంతంగా ఆయన పేరిట రాయించుకున్నారని యూరి రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తండ్రి జగన్నాథ రెడ్డి పేరు మీద ఉన్న వాటా షేర్లు తమకు ఇవ్వకుండా రామోజీరావు మోసం చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. యూరి రెడ్డి ఫిర్యాదు మేరకు మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజాకిరణ్, ఇతరులపై ఆంధ్రప్రదేశ్ సిఐడి ఇప్పటికే కేసు నమోదు చేసింది.
గత కొంతకాలంగా మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ లో చోటు చేసుకుంటున్న అవినీతి అక్రమాలపై సిఐడి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే షేర్ హోల్డింగ్ పై స్పష్టత రావడంతో మార్గదర్శి వ్యవస్థాపకుల కుటుంబ వ్యక్తిగా యూరి రెడ్డి తెరపైకి వచ్చారు. సిఐడికి ఆయన ఫిర్యాదు చేసిన మరుక్షణమే రామోజీరావు లీగల్ టీం ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో హైకోర్టు సిఐడి విచారణపై స్టే విధించింది. ఈ తరుణంలోనే యూరి రెడ్డి మార్గదర్శి కేసు విషయమై రామోజీరావు పై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం విశేషం. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.