Munugode By-Elections: మునుగోడులో టీఆర్ఎస్ – బీజేపీ కలిసి బెంగాల్ ప్రయోగం చేయబోతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అమిత్ షా ఆదేశాలతో సీఆర్పీఎఫ్ దిగబోతోందన్నారు. బీజేపీ కోసం సీఆర్పీఎఫ్ – టీఆర్ఎస్ కోసం రాష్ట్ర పోలీసులు పని చేయబోతున్నారన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు వ్యవస్థలు ఉద్రిక్తతలు సృష్టించి… రెండు పార్టీల ఎన్నికల పోలరైజేషన్ కోసం పని చేయబోతున్నాయన్నారు. ‘‘ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు రెండు పార్టీల మధ్య పోలరైజేషన్ కు కుట్ర పన్నారు. కేసీఆర్ ఢిల్లీలో చీకట్లో మోడీ, షా ఉపదేశం తీసుకుని వస్తున్నాడు – రేవంత్ఎన్నికల సంఘ కార్యాలయం ముందు బైఠాయించి… సెంటిమెంట్ రాజేయబోతున్నాడు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల ముందు కూడా రఘునందన్, ఈటెలలను ఉరేయబోతున్నట్టు హడావుడి చేశారు. ఆ ఇద్దరు గెలిచాక వాళ్లపై కేసులు కాకులెత్తుకెళ్లాయి. మునుగోడులో సైతం ఆ ఇద్దరి మధ్యనే పోలరైజేషన్ కోసం… ఇద్దరు కలిసే ఉద్రిక్తతలు సృష్టించి కుట్ర చేయబోతున్నారు. కార్యకర్తలు… మునుగోడు ప్రజలు అప్రమత్తంగా ఉండి… ఈ కుట్రను తిప్పి కొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

‘నామినేషన్ రోజు తప్ప కూసుకుంట్ల ఇప్పటివరకు పత్తా లేడు. అభ్యర్థి కేటీఆరో, హరీష్ రావో, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డో అర్థం కావట్లేదు. కనీసం ప్రజలకు ఏం చేశారో చెప్పుకునేందుకు కూడా ప్రజల ముందుకు రావట్లేదు ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సమస్యలపై కొట్లాడుతా.. ఈ ఉప ఎన్నికలతో అభివృద్ధి జరుగుతదని రాజగోపాల్ చెప్పిండు… అభివృద్ధి మాటేమిటో గానీ చీకటి పడితే చాలు సీసాలు వస్తున్నాయ్.. జెండా, రంగు మార్చి మీ దగ్గరకు మారు వేషంలో వస్తున్నారు. వారికి కావాల్సింది మీ ఓట్లే కానీ… మీ సంక్షేమం కాదు పేర్లు సరిగా పలకలేని వ్యక్తి ఇవాళ టీఆరెస్ అభ్యర్థి గా ఉన్నాడు.. ఇక్కడ ఓటు కూడా లేని వ్యక్తి బీజేపీ అభ్యర్థిగా ఉన్నాడని’ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
గతంలో ఉప ఎన్నికలు జరిగిన దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్ లకు వీళ్లు చేసిందేం లేదు. ఒక్క అవకాశం మీ ఆడబిడ్డకు ఇవ్వండి.. ఆడబిడ్డ గెలుపుతోనే మునుగోడు సమస్యలు తీరుతాయి. కాంట్రాక్టర్లు, కమీషన్లు మెక్కే వాళ్లు, నాలుక తిరుగని వాళ్లను అభ్యర్థులుగా నిలబెట్టారు. ఇది మునుగోడు ప్రజలను అవమానించడమే. మీరే బలం, బలగం.. టీఆరెస్, బీజేపీ ని బొంద పెట్టండి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీని గెలిపించండని పిలుపునిచ్చారు.