
తెలంగాణలో రాజకీయ రగడ మొదలైంది. పార్టీల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల్లో పోటీ నెలకొంది. మంత్రి మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ముఖ్యమంత్రి దత్తత గ్రామం మూడు చింతలపల్లిలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇరు పార్టీలు నువ్వా నేనా అని సవాలు విసురుకుంటున్నాయి. నాయకులు తొడలు కొట్టే స్థాయికి వెళ్లారు. దమ్ముంటే మాపై గెలవాలని ఇద్దరు నేతలు మాటల దాడులు చేసుకుంటున్నారు.
మూడు చింతలపల్లిలో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష ముగింపు సందర్భంగా మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలకు అనుమతులు లేవని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రతిగా మంత్రి మల్లారెడ్డి తొడగొట్టి సవాల్ విసరడం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. రేవంత్ రెడ్డి మాటలకు మంత్రి తన స్థాయి మరిచిపోయి ఒక వీధి రౌడీలా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనపై చేసిన ఆరోపణలు నిజమైతే తాను రాజీనామాకు సిద్ధమని లేదంటే రేవంత్ రాజీనామా చేయాలని సవాలు చేశారు.
కావాలంటే రేవంత్ రెడ్డి తనపై పోటీ చేసి నెగ్గాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ రాజీనామా చేసి రేవంత్ రెడ్డిపై గెలవాలని అద్దింకి దయాకర్ సవాల్ చేశారు. అవినీతి, అక్రమాలపై మాట్లాడితే మల్లారెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. మంత్రి పదవిలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడడం సరైందేనా అని ప్రశ్నించారు.
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఓటమి భయంతోనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు భూ కబ్జాలకు పాల్పడితే ఆధారాలతో బయటపెట్టాలని సూచించారు. అంతే కాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదని చెప్పారు. ఈ నేపథ్యంలో బోయినపల్లిలోని మంత్రి మల్లారెడ్డి నివాసాన్ని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముట్టడించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. బోయినపల్లి కూడలి వద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.