కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మాటతీరు కానీ ఆయన ఎంచుకునే దారి కానీ మిగతా నేతలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే నేతగా, ఏ విషయంలోనైనా దూకుడుతో వ్యవహరించే నేతగా రేవంత్ రెడ్డికి పేరుంది. రేవంత్ టీడీపీలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా ఆయన తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి తాజాగా కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది.
Also Read : కేసీఆర్ మరో సంచలనానికి శ్రీకారం
రేవంత్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు కోసం రహస్యంగా సర్వేలు చేయిస్తున్నాడని సమాచారం అందుతోంది. ఫైటింగ్ నేచర్ తో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ కొత్త పార్టీ పెడితే అది మరో సంచలనమే అవుతుంది. ఏ పార్టీలో చేరినా తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంతో అనతి కాలంలోనే పదవులు దక్కించుకోవడం రేవంత్ కు వెన్నతో పెట్టిన విద్య. అతని పనితనమే కాంగ్రెస్, టీడీపీలలో అధినేతలకు అతనిని దగ్గర చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊపు రావడానికి కూడా ఒక రకంగా రేవంత్ రెడ్డే కారణం అని చెప్పవచ్చు. ఒకానొక దశలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ను ఫైనల్ చేసినట్టు వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు. అయితే తాజాగా రేవంత్ రాజకీయ పార్టీ ప్రచారం తెలంగాణలో ఊపందుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలతోనే రేవంత్ కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
రేవంత్ రాజకీయంగా ఎదిగితే కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవని బాబు భావిస్తున్నారని సమాచారం. రేవంత్ పార్టీ పెడితే రెడ్డి సామాజిక వర్గమంతా ఆయనకు అండగా నిలబడే అవకాశం ఉంది. టీడీపీ కార్యకర్తలు సైతం రేవంత్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే రేవంత్ వర్గం మాత్రం జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తోంది. జిహెచ్ఎంసి ఎన్నికలపై దృష్టి పెట్టి రేవంత్ రెడ్డి సర్వే చేయిస్తున్నాడని ఆయన వర్గం చెబుతోంది. గత అనుభవాల నేపథ్యంలో రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలను ఎంపీ ఛాలెంజ్ గా తీసుకున్నారని తెలుస్తోంది. అయితే రేవంత్ సర్వే కొత్త పార్టీ కోసమా….? కాదా…? అనే విషయం తెలియాల్సి ఉంది.
Also Read : అన్న ఎన్టీఆర్ ను మరవని కేసీఆర్..