
దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయరని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన ‘దళిత గిరిజన దండోరా బహిరంగ సభ’లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీల జీవితాలు చితికిపోతున్నాయని.. ఆదివాసీల జీవితాలు మార్చాలన్నదే కాంగ్రెస్ ప్రణాళిక అని రేవంత్ అన్నారు. ఎన్నికల కోసమే కేసీఆర్ పథకాలు తెస్తున్నాడని రేవంత్ ఎద్దేవా చేశారు.
ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు ఎస్సీలు గుర్తుకొస్తారని.. దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు అమలు చేయరని రేవంత్ ప్రశ్నించారు. కాంట్రాక్టులు, కమీషన్లతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లను దోచుకుంటోందన్నారు.
కేసీఆర్ కు ఎస్సీలపై ప్రేమే లేదని.. సీఎంను చేస్తానని చేయలేదని.. డిప్యూటీ సీఎంను చేసి రెండు నెలలకే తొలగించారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీలకు చోటు దక్కలేదన్నారు.
దళితులకు చట్టసభల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ‘రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ ను నియమించింది కాంగ్రెస్. రాష్ట్రం ఏర్పడితే దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని.. లేదంటే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్ ఏం చేశారని నిలదీశారు.
ఉప ఎన్నిక ఉందని హుజూరాబాద్ లో దళితులకు రూ.10లక్షలు అంటున్నారని.. 118 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాాలని.. అప్పుడే దళితబంధు వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.