YS Sharmila: రాజన్న రాజ్యమే లక్ష్యంగా తెలంగాణలో అడుగుపెట్టిన వైఎస్ షర్మిలకు (YS Sharmila) భవిష్యత్ అంధకారంగానే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఫిబ్రవరి 9న తెలంగాణలో అడుగుపెట్టి జులై 8న పార్టీ ప్రారంభించిన షర్మిలకు తగిన రీతిలో మద్దతు లభించడం లేదు. దీంతో ఆమెలో నైరాశ్యం పెరుగుతోందని తెలుస్తోంది. నిరుద్యోగుల సమస్యలే ఎజెండాగా ముందుకు కదులుతున్న ఆమెకు అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబం నుంచి వచ్చినా ఫలితం మాత్రం శూన్యమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీని ఇనుమడించగల ఎజెండా వారి వద్ద లేకపోవడంతో సమస్యల పరిష్కారంపై పట్టు కుదరట్లేదు. రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే బలమైన నాయకత్వం ఉండి తీరాలి. కానీ ఇంతవరకు షర్మిల పార్టీలో ఒక్క నేత కూడా బలమైన వారు కనిపించడం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు తన వెంట ఉన్నారని భావించి పార్టీ పెట్టినా వట్టిదే అని తేలిపోయింది. పైగా ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) వచ్చాక అందరు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. దీంతో ఆమె పార్టీ మనుగడ ప్రశ్నార్థకంలో పడిపోయింది.
తెలంగాణ రాజకీయాలపై స్పష్టమైన అవగాహన లేకపోవడంతో షర్మిల పార్టీ కష్టాలు ఎదుర్కొంటోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా షర్మిల పార్టీని గుర్తించలేదు. మిగతా పార్టీలు కూడా షర్మిల పార్టీపై పెద్దగా పట్టించుకోవడం లేదు. రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకు తనకే ఉంటుందని భావించినా అది భ్రమే తేలిపోతోంది. ప్రస్తుతం ఆ సామాజికవర్గం ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు మళ్లుతున్నాయని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి అదే సామాజికవర్గం కావడంతో ఆ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ భవితవ్యం డోలాయమానంలో పడినట్లు అయింది.
మరో వైపు సీఎం కేసీఆర్ దళితబంధు పథకంతో దళితుల ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నతరుణంలో హుజురాబాద్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకు షర్మిల పార్టీలోకి నేతలెవరు రాకపోవడంతో ఆమె పార్టీ తెలంగాణలో మనుగడ కష్టమే అని స్పష్టం అవుతోంది. దీంతో ఆమె నమ్ముకున్న సమస్యలు నట్టేట ముంచుతున్నాయి. నేతలు కూడా ఆమె వెంట నడిచేందుకు వెనకడుగు వేస్తున్నారు. రానున్న ఎన్నికలో ప్రభావం చూపుతామని చెబుతున్నా అది ఆచరణ సాధ్యం కాదని తెలిసిపోతోంది.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. రెడ్డి సామాజికవర్గం అధికశాతం జగన్ వైపే ఉండడంతో తెలంగాణలో కూడా ఇదే జరుగుతుందని భావించినా కుదరట్లేదు. రేవంత్ రెడ్డి రాకతో రెడ్లలో మార్పు వచ్చింది. ఆయన నాయకత్వంపై విశ్వాసంతో ఉన్నారు. అందుకే షర్మిలకు రెడ్ల మద్దతు ఉండదని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో షర్మిల రాజకీయ సమీకరణలు ఏ విధంగా ఉంటాయోనని అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.