Dalit Bandhu: తెలంగాణలో (Telangana) ప్రస్తుతం దళిత బంధు (Dalit Bandhu) పథకం హల్ చల్ చేస్తోంది. రాజకీయాలనే శాసిస్తోంది. సీఎం కేసీఆర్ (CM KCR) తీసుకొచ్చిన ఈ పథకంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. పథకం అమలుపై అందరిలో కొన్ని రకాల సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు రూ.2 వేల కోట్లు విడుదల చేసింది. నియోజకవర్గంలోని అన్ని దళిత కుటుంబాలకు పథకం అమలు చేయాలని భావిస్తోంది. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిధులు విడుదల చేస్తోందని తెలుస్తోంది.
రానున్న రోజుల్లో బీసీ, ఎస్టీ, ఓసీల్లోని పేదలకు కూడా ఈ పథకం వర్తింపజేయాలని చూస్తోంది. దీనిపై ఇదివరకే కేసీఆర్ ప్రకటన చేశారు. దళితబంధు పథకంతో అన్ని వర్గాల్లో వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొదటి విడతగా 100 మందికి రూ.10 లక్షల చొప్పున అందజేస్తామని చెబుతోంది. హుజురాబాద్ వేదికగా ఆగస్టు 16న 15 మందికి చెక్కులు అందజేసి పథకం ప్రారంభించారు. ఇందులో మొత్తం సబ్సిడీ అని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.
దళితబంధు పథకంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ ఈ పథకం తెచ్చారని చెబుతున్నాయి. కేసీఆర్ కు నిజంగా దళితులపై ప్రేమ ఉంటే మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉప ఎన్నికకు ముందే రాష్ర్టంలోని అన్ని నియోజకవర్గాల్లో పథకం అమలు చేయాలని సూచిస్తున్నారు. దళితబంధు పథకం కూడా ఆరంభ శూరత్వమే అని పెదవి విరుస్తున్నాయి. కేసీఆర్ మాత్రం ఆరునూరైనా పథకం అమలు చేసి తీరుతామని చెబుతున్నారు.
తెలంగాణలో దళితుల జనాభా సుమారు 80 లక్షల వరకు ఉంటుంది. రాష్ర్టంలో అత్యధిక జనాభా వారిదే. దీంతో వారిని ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ పథకం రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దళితుల ఓట్లు మొత్తంగా పొందగలిగితే 2023లో విజయం తమదేనని భావించి ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు సమాచారం. దీంతో దళితుల ఓట్లు సాధించేందుకే ప్రభుత్వం పక్కా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
దళితులను దేశానికే ఆదర్శంగా నిలబెడతామని కేసీఆర్ పేర్కొంటున్నారు. కరోనా నేపథ్యంలో పథకం ఆలస్యమైందని చెబుతున్నారు. స్వార్థ రాజకీయాల కోసమే ఇలాంటి పథకాలు తెస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఏది ఏమైనా దళితులకు మహర్దశ కల్పించే దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ మాత్రం పక్కా ప్రణాళికతోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో లబ్ధిదారుల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది.