పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించే పనిలో బీజీ అయిపోయారు. ఆయన నియామకంపై మొదట విమర్శలు వచ్చినా తరువాత అంతా సద్దుమణిగిపోయింది. అసమ్మతిని తుడిచేశారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు ఎక్కుపెట్టి ఏకేస్తున్నారు. దీంతో అధిష్టానం కూడా మంచి నిర్ణయమే తీసుకుందనే విధంగా దూసుకుపోతున్నారు. దీంతో టీఆర్ఎస్ కంటే బీజేపీకి నష్టం కలిగించే విదంగా ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం ద్వారా అధికార పక్షానికి లాభం చేకూరుతుందని అధికార పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రతిపక్షాల బలం తగ్గించేందుకు ఎత్తుగడలు వేస్తోంది. గతంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధిపొందిన బీజేపీని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ విధానానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ లో ఓటమి పాలైన బీజేపీ ఎలాగైనా తెలంగాణలో విజయం సాధించాలనే తప్నతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. దీంతో రేవంత్ రెడ్డిని కాస్త లేపితే ఆ ఓట్లు బీజేపీకి దక్కకుండా పోతాయనే ఆలోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు భావిస్తున్నారు.
మరోవైపు షర్మిల పార్టీకి బీజేపీ మద్దతు ఉందని పుకార్లు వ్యాపిస్తున్నాయి. అటు క్రిస్టియన్, రెడ్డి సామాజిక వర్గాల ఓట్లను రాబట్టుకోవడం కోసమే షర్మిల పార్టీ స్థాపించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా దూసుకుపోవడంతో బీజేపీకి నష్టం జరిగి కాంగ్రెస్ కే లాభం చేకూరేలా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గతంలో రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన కేసీఆర్ అనుకూల మీడియా ఇప్పుడు తెగ ప్రచారం చేస్తోంది. మై హోం సంస్థలపై రేవంత్ గతంలో ఫిర్యాదు చేయడంతో రేవంత్ పై దుమ్మెత్తిపోసింది. దీంతో రేవంత్ రెడ్డి వార్తలను పూర్తిగా నిషేధించింది. కానీ ఈ మధ్య వరుస కథనాలతో రేవంత్ ను ఆకాశానికి ఎత్తుతున్నాయి. దీంతో అధికార పార్టీ పన్నాగంలో ఒక భాగంగానే ఈ తతంగం అంతా నడుస్తుందని తాజా విశ్లేషకులు సూచిస్తున్నారు.
రేవంత్ రెడ్డిని పెంచి బీజేపీ బలాన్ని తగ్గించాలనే నిర్ణయంతో కేసీఆర్ పాచికలు వేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డికి కవరేజ్ పెంచారనే వార్తలు ఊపందుకుంటున్నాయి. బీజేపీని బలహీనపరిచే క్రమంలో టీఆర్ఎస్ వ్యవహారం ఇప్పుడు బాగా ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి రాజకీయం కాంగ్రెస్ పార్టీ బలానికంటే బీజేపీకే ఎక్కువ నష్టం కలిగించే దిశగా ఉంటుదని భావించి ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.