Homeజాతీయ వార్తలుRevanth Fires On CM KCR: కేసీఆర్ దత్తత రాజకీయం బయటపెడుతున్న రేవంత్ రెడ్డి

Revanth Fires On CM KCR: కేసీఆర్ దత్తత రాజకీయం బయటపెడుతున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy Fires on CM KCR

Revanth Fires On CM KCR: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పై దూకుడు కొన‌సాగిస్తున్నారు. కేసీఆర్ ల‌క్ష్యంగా యుద్ధం కొన‌సాగిస్తున్నారు. సీఎం ఎలాంటి రాజ‌కీయం చేస్తున్నారో.. అదే త‌ర‌హాలో రివ‌ర్స్ పాలిటిక్స్ న‌డిపిస్తున్నారు. ముఖ్య‌మంత్రి ద‌త్త‌త గ్రామం మూడుచింత‌ల‌ప‌ల్లిలో మంగ‌ళ‌వారం దీక్ష చేప‌ట్టిన రేవంత్‌.. కేసీఆర్ పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. డ‌బుల్ బెడ్ రూమ్ లు ఎందుకు క‌ట్టిస్తున్నారో కేసీఆర్ గ‌తంలో చెబుతూ.. మ‌హిళ‌లు స్నానం చేసిన త‌ర్వాత దుస్తులు మార్చుకునేందుకు కూడా ఇబ్బంది ప‌డుతున్నార‌ని, చుట్టం వ‌స్తే ప‌డుకోవ‌డానికి కూడా లేద‌ని అందుకే.. బందోబ‌స్తుగా డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నామ‌న్నారు.

ఈ హామీ నెర‌వేర్చ‌లేద‌ని.. ఇదే త‌ర‌హాలో చెప్పారు రేవంత్‌. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని చిన్న‌ముల్క‌నూరు గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్టు 2015లో కేసీఆర్ ప్ర‌క‌టించార‌ని చెప్పారు. అంద‌రికీ ఇళ్లు క‌ట్టిస్తామ‌ని 245 ఇళ్ల‌ను కూల్చేశార‌న్న రేవంత్.. ఇప్ప‌టి వ‌ర‌కూ నిర్మించ‌లేద‌న్నారు. దీంతో.. ఉండేందుకు, స్నానం చేసేందుకు ఆడ‌పిల్ల‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌ని, త‌డ‌క‌ల బాత్ రూమ్ లో స్నానం చేస్తుంటే.. పోకిరీలు చూస్తున్నార‌ని త‌ల్లిదండ్రులు ఆవేద‌న చెందుతున్నార‌ని రేవంత్ చెప్పుకొచ్చారు. ఆ విధంగా.. త‌న ద‌త్త‌త గ్రామంలోనే ఇళ్లు నిర్మించ‌లేక‌పోయిన కేసీఆర్.. రాష్ట్రం మొత్తం ఎప్పుడు నిర్మిస్తార‌ని ప్ర‌శ్నించారు.

ఇక‌, కేసీఆర్ ద‌త్త‌త తీసుకున్న రెండో గ్రామం ల‌క్ష్మాపూర్ గురించి కూడా ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం ధ‌ర‌ణి వెబ్ సైట్లో ల‌క్ష్మాపూర్ గ్రామం బొమ్మే లేద‌న్నారు. అక్క‌డి రైతుల‌కు రైతుబంధు, రైతుబీమా రావ‌ట్లేద‌న్నారు. కేసీఆర్ మూడో ద‌త్త‌త గ్రామం కేశ‌వ‌రంలోనూ ఇదే ప‌రిస్థితి ఉంద‌న్నారు. ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి ఇవ్వ‌లేద‌న్నారు. డ‌బుల్ బెడ్రూమ్ అంద‌రికీ ఇచ్చారా? అని ప్ర‌శ్నించారు. ల‌క్ష రూపాయ‌ల రైతు రుణ‌మాఫీ చేశారా? అని నిల‌దీశారు. 16 వేల కోట్ల రూపాయ‌ల మిగులు బ‌డ్జెట్ తో తెలంగాణ రాష్ట్రాన్ని అప్ప‌గిస్తే.. ఇప్పుడు 4.5 ల‌క్ష‌ల కోట్లు అప్పులు మోపార‌ని, దీనివ‌ల్ల పుట్ట‌బోయే బిడ్డ‌పైనా రూ.ల‌క్ష అప్పు ఉంద‌ని అన్నారు రేవంత్‌.

మొత్తంగా.. కేసీఆర్ ద‌త్త‌త గ్రామంలో ఎలాంటి ప‌నులూ చేయ‌ట్లేద‌ని కేవ‌లం.. ప‌బ్లిసిటీ కోస‌మే మూడు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకున్నార‌ని విమ‌ర్శించే ప్ర‌య‌త్నం చేశారు రేవంత్‌. హైద‌రాబాద్ లో వ‌ర‌ద‌లు వ‌స్తే.. 3 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ప‌ది వేల చొప్పున ఇవ్వ‌లేక‌పోయిన కేసీఆర్‌.. ద‌ళిత బంధు ద్వారా.. రాష్ట్రంలోని 30 ల‌క్ష‌ల ద‌ళిత‌, గిరిజ‌న కుటుంబాల‌కు ప‌ది ల‌క్ష‌లు ఇస్తారా? అని ప్ర‌శ్నించారు. త‌ద్వారా.. ద‌ళిత బంధు హుజూరాబాద్‌ ఎన్నిక‌ల కోస‌మే తెచ్చార‌ని జ‌నాల‌కు అర్థం చేయించే ప్ర‌య‌త్నం చేశారు.

ఇదిలాఉంటే.. మూడుచింత‌ల‌ప‌ల్లిలో నిర్వ‌హించిన స‌భ‌కు సీఎల్పీ నేత భ‌ట్టి, సీనియ‌ర్ నేత‌లు మ‌ధుయాష్కి, ష‌బ్బీర్ అలీ, పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, బ‌ల‌రాం నాయ‌క్‌, ఎమ్మెల్యే సీత‌క్క త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. త‌ద్వారా.. సీనియ‌ర్లతో ఎలాంటి విభేదాలూ లేవ‌ని చాటుకున్నారు రేవంత్‌. తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్ ఫేవ‌రెట్ గా బ‌రిలోకి దిగాలంటే.. బీజేపీని ఓవ‌ర్ టేక్ చేయ‌డంతోపాటు.. టీఆర్ ఎస్ ను ధీటుగా ఎదుర్కోవాల్సి ఉంది. ఇందుకోసం రేవంత్ తీవ్రంగానే శ్ర‌మిస్తున్నారు. మ‌రి, ఎంత వ‌ర‌కు వారి వ్యూహాలు ఫ‌లిస్తాయ‌న్న‌ది చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version