CM Revanth Reddy: ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్న రేవంత్ రెడ్డి.. పాలనలోనూ తనదైన మార్క్ చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొలువుతీరిన తన కొత్త ప్రభుత్వంలో అనుభవజ్ఞులైన అధికారులకు పెద్దపీట వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇందులో కొంతమంది ఐఏఎస్ అధికారులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి లూప్ లైన్లో ఉంచిన వారికి ఎర్ర తివాచీ పరిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా లూప్ లైన్ లో ఉన్న అధికారులకు విఐపి స్థాయిలో గౌరవం లభించింది. అంటే దీని ఆధారంగా చూస్తే వారికి మంచి పోస్టులు దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆ అధికారుల్లో కొంతమందిని ముఖ్యమంత్రి కార్యాలయంలో నియమించే అవకాశాలున్నాయి. తెలంగాణ స్థానికత ఉన్న అధికారులకు అమితమైన ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వీరికి కీలక పోస్టులు
రాష్ట్ర వాణిజ్య పనులు, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సునీల్ శర్మ పనిచేస్తున్నారు. ఈయనకు కీలక పోస్టుదాకే అవకాశం కనిపిస్తోంది. సునీల్ శర్మ మరెవరో కాదు మాజీ రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ మనవడు. శంకర్ దయాల్ శర్మ కాంగ్రెస్ నాయకుడు కూడా. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనకు అమితమైన ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని చర్చి నడుస్తోంది. ఇక మంత్రి శ్రీధర్ బాబు సతీమణి, ప్రస్తుతం యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్ కు లేక పోస్టు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. జనగామ జిల్లాకు చెందిన 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశం ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈయనకు కూడా కీలక పోస్టు దక్కే అవకాశం కనిపిస్తోంది. వాటర్ బోర్డు ఎండి దాన కిషోర్, సీఎమ్ఓ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఆర్థిక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవికి కూడా కీలక పోస్టులు లభిస్తాయని జరుగుతోంది. రాహుల్ బొజ్జ, దాన కిషోర్ దళిత సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో.. ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల అండదండలు వారికి పుష్కలంగా ఉన్నాయని చర్చ జరుగుతుంది.
ఇప్పటికే రేవంత్ రెడ్డి వద్దకు
అదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ దళిత ఎమ్మెల్యే దాన కిషోర్ పేరును సీఎం రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తావించినట్టు ప్రచారం జరుగుతుంది. రాహుల్ బొజ్జ పేరును కూడా కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తోంది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ శశాంక్ గోయల్ కు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వచ్చని తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉన్నంతకాలం ఆయనను లూప్ లైన్ లో పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్న శాంతి కుమారి తర్వాత ఆయనే సీనియర్ ఐఏఎస్ అధికారి. శాంతి కుమారి 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. శశాంక్ 1990 బ్యాచ్ కు చెందినవారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన అధికారులను పక్కనపెట్టి.. తమకు అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే కీలక పదవుల్లోకి తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ ల పై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తమదైన ప్రత్యేక జట్టును తయారు చేసుకోవడానికి కసరత్తు కూడా చేస్తోందని సమాచారం. ఇది పూర్తయితే రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ లు, ఐపీఎస్ ల బదిలీలు ఉంటాయని.. కొత్తవారికి పోస్టింగ్ కూడా ఇస్తారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రేవంత్ రెడ్డి ఓకే చెప్పగానే భారీగా బదిలీలకు ఆస్కారం ఉంటుందని తెలుస్తోంది.