Pawan Kalyan Alliance: పొత్తుపై పునరాలోచన? జనసేనాని మౌనం దేనికి సంకేతం..?

Pawan Kalyan Alliance: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మౌనం దేనికి సంకేతం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహార శైలిలో, మాట తీరులో వచ్చిన మార్పుతో పవన్ కళ్యాణ్ కలత చెంది మౌనం వహించారా..? అసలు పవన్ కళ్యాణ్ మౌనం దేనికి సంకేతం అన్న చర్చ ఇప్పుడు రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా రాజకీయంగా యాక్టివ్ […]

Written By: BS, Updated On : April 1, 2023 1:51 pm
Follow us on

Pawan Kalyan Alliance

Pawan Kalyan Alliance: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మౌనం దేనికి సంకేతం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహార శైలిలో, మాట తీరులో వచ్చిన మార్పుతో పవన్ కళ్యాణ్ కలత చెంది మౌనం వహించారా..? అసలు పవన్ కళ్యాణ్ మౌనం దేనికి సంకేతం అన్న చర్చ ఇప్పుడు రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా రాజకీయంగా యాక్టివ్ గా లేరు. ప్రతి అంశంపై గత కొన్నాళ్ల నుంచి స్పందిస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ ముఖ్యంగా గత రెండు, మూడు వారాల నుంచి సైలెంట్ అవ్వడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు మాట్లాడుతున్న మాటలు, పొత్తులపై చేస్తున్న కామెంట్లు వంటి అంశాలను నిశితంగా పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్ సైలెంట్ అయినట్లు చెబుతున్నారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పొత్తులపై చర్చలు ముగిసాయని, ఇన్ని సీట్లు జనసేనకు ఇస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మాట్లాడిన పవన్ కళ్యాణ్.. పొత్తు చర్చలు ఇంకా జరగలేదని, సీట్ల పంపకాలు ఇంకా పూర్తి కాలేదని స్పష్టత ఇచ్చారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మౌనం వహించడం వెనుక బలమైన కారణం ఉంది అన్న చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో మారిన స్వరం..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తరువాత జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విజయం తరువాత టిడిపి నాయకుల మాట తీరులో పూర్తిగా మార్పు వచ్చింది. జనసేన పార్టీ అవసరం లేకపోయినా వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తాం అన్న భావనను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు సోషల్ మీడియాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సానుకూలంగా కామెంట్లు చేసిన చాలామంది.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను లైట్ తీసుకుంటున్నారు. ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగంగానే చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో పొత్తు కోసం తాము వెంపర్లాడడం లేదని, వస్తే కలిసి వెళతాం, లేకపోతే లేదు అన్న భావనను తెలియజేసే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ నిశితంగా పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్ అందుకే మౌనం దాల్చినట్లు చెబుతున్నారు.

జనసేన భాగస్వామ్యాన్ని విస్మరించిన టిడిపి..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం వెనుక జనసేన పార్టీ భాగస్వామ్యం ఉందన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ బలంగానే ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా జనసేన ఓటు వేయాలని ఇచ్చిన పిలుపును తెలుగుదేశం పార్టీ గ్రహించడం లేదు. జనసేన పార్టీ పిలుపుతో వేలాదిమంది జనసైనికులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించారు. అయితే కనీసం ఈ విషయాన్ని కూడా ఎక్కడ ఆయా అభ్యర్థులు గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని ప్రస్తావించలేదు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇది మంచి సంకేతం గా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే మొన్న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విజయం విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఇరు పార్టీల ఎమ్మెల్యేలు, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించి ఓట్లు వేయడంతో పవన్ కళ్యాణ్ స్పందించకుండా ఉండిపోయారు.

లైట్ తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీ..

మొన్నటి వరకు జనసేన పార్టీతో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దక్కిన విజయం తర్వాత మాత్రం జనసేన పార్టీని లైట్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అందుకనే ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని తెలుగుదేశం పార్టీ విజయంగా మాత్రమే చూస్తున్నారు. కనీసం జనసేన పార్టీ సాయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. అలాగే లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన మొదటిలో పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీతో పొత్తు గురించి, వారాహి యాత్ర గురించి అనేక సందర్భాల్లో మాట్లాడారు. కానీ ఈ మధ్యకాలంలో లోకేష్ పవన్ కళ్యాణ్, జనసేన గురించి స్పందించేందుకు ఇష్టపడడం లేదు. పొత్తుల గురించి ఎన్నికల సమయంలో చూద్దాం అని చెబుతుండడం గమనార్హం. ఇవన్నీ చూస్తుంటే తెలుగుదేశం పార్టీ జనసేన ను లైట్ తీసుకుందని ప్రచారం జోరుగా సాగుతోంది.

Pawan Kalyan Alliance

బలమైన వ్యూహంలో భాగమే పవన్ కళ్యాణ్ మౌనం..

ఇవన్నీ నిశితంగా పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్ మౌనం దాల్చినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పాటు, వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాల పైన కొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో వారాహి యాత్ర, పొత్తులకు సంబంధించిన కీలకమైన ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా తనతో పాటు పోటీ చేసే ప్రతి ఒక్కరూ అసెంబ్లీకి వెళ్లడమే లక్ష్యంగా తన అడుగులు ఉంటాయని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఆ దిశగానే తన కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. అయితే గతంలో చెప్పినట్లుగా గౌరవం తగ్గకుండా ఉంటేనే పొత్తుకు సంబంధించిన ప్రస్తావన ఉండే అవకాశం ఉందని ఆయన ఎప్పటికీ స్పష్టం చేశారు. తాజా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. రాజకీయంగా అనుభవాన్ని సంపాదించిన పవన్ కళ్యాణ్ తాను వేయబోయే అడుగును ఆచితూచి వేసే అవకాశం కనిపిస్తోంది. అందుకనే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మౌనాన్ని ఆశ్రయించినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మౌనం వెనుక బలమైన వ్యూహం దాగి ఉందన్నది రాజకీయ విశ్లేషకుల మాట.