YCP Sixth List: వైసీపీ అభ్యర్థుల ఆరో జాబితా వెల్లడించారు. ఇప్పటివరకు ఐదు జాబితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 60 అసెంబ్లీ స్థానాలకు సిట్టింగ్లను మార్చారు. తాజాగా ఆరో జాబితాలో మరో 10 మందికి స్థానచలనం కల్పించారు. శుక్రవారం రాత్రి మంత్రి మేరుగ నాగార్జున, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జాబితాను ప్రకటించారు. నాలుగు పార్లమెంట్ స్థానాలతో పాటు ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే పక్కా సామాజిక వ్యూహంతోనే జగన్ ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంతో పాటు బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం విశేషం.
రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, నరసాపురానికి గూడూరి ఉమాబాల, గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటరమణ, చిత్తూరు నుంచి రెడ్డప్ప బరిలో దిగనున్నారు. మైలవరం అసెంబ్లీ స్థానానికి సంబంధించి నార్నాల తిరుపతిరావు యాదవ్, మార్కాపురం నుంచి అన్నా రాంబాబు, గిద్దలూరు నుంచి కే.నాగార్జున రెడ్డి, నెల్లూరు సిటీ ఎండి ఖలీల్, గంగాధర నెల్లూరు నుంచి నారాయణస్వామి, ఎమ్మిగనూరు నుంచి బుట్టా రేణుక అభ్యర్థిత్వలను ఖరారు చేస్తూ వైసీపీ హై కమాండ్ జాబితాను ప్రకటించింది. అయితే ఈసారి సామాజిక సమీకరణలకు పెద్దపీట వేశారు. రాజమండ్రి, నరసాపురం స్థానాలకు శెట్టిబలిజ, కాపులకు అవకాశం కల్పించారు. గుంటూరు నుంచి కూడా ఈసారి కమ్మ సామాజిక వర్గాన్ని తప్పించారు. మరోవైపు గిద్దలూరులో రెడ్డి సామాజిక వర్గం వారికి అవకాశమిచ్చారు. ఎమ్మిగనూరులో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుకకు చాన్స్ ఇచ్చారు. గిద్దలూరు లో వైశ్య సామాజిక వర్గానికి ఇప్పటివరకు ప్రాధాన్యం ఉండేది. ఎమ్మిగనూరులో రెడ్డి సామాజిక వర్గం అధికం. గిద్దలూరులో రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించి.. ఎమ్మిగనూరును పద్మశాలిలకు అవకాశం ఇచ్చారు.
అయితే ఇటీవల విడుదల చేసిన ఐదో జాబితాలోనూ, ఇప్పుడు విడుదల చేసిన ఆరో జాబితాలోనూ.. అభ్యర్థుల మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గత జాబితాలో తిరుపతి ఎంపీగా నియమించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వద్దని వెళ్ళిపోయారు. దీంతో ఆ స్థానానికి వేరే వారిని నియమిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఎమ్మెల్యే స్థానానికి పంపించిన ఎంపీ గురుమూర్తిని తిరిగి తిరుపతి పార్లమెంట్ స్థానం అభ్యర్థిగా నియమించారు. ఈ ఆరో జాబితాలోనూ ఇలాంటి మార్పు కనిపించింది. చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డప్పను అసెంబ్లీకి పంపించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు ఎంపీగా పంపించారు. కానీ ఈ జాబితాలో మాత్రం తిరిగి వారిని యధావిధి స్థానాలకు పంపించడం విశేషం. ఒకవైపు సామాజిక సమతుల్యం పాటిస్తూనే.. గతంలో చేసిన అభ్యర్థుల మార్పును సరిచేయడం వెనుక .. జగన్ ఎంత సీరియస్ గా వ్యవహరిస్తున్నారో అర్థం అవుతోంది.