AP Liquor: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇకనుంచి పాత బ్రాండ్లే!

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చింది. ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసింది. ప్రభుత్వమే నేరుగా దుకాణాలు నడుపుతోంది. ఏడాదికి 25 శాతం షాపులను తగ్గించి.. నాలుగు సంవత్సరాల్లో మద్య నిషేధం వైపు అడుగులు వేస్తానని జగన్ ప్రకటించారు.

Written By: Dharma, Updated On : February 3, 2024 12:20 pm

AP Liquor

Follow us on

AP Liquor: ఏపీలో మద్యం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దేశంలో ఎక్కడా లేని, ఎక్కడా వినని మద్యం బ్రాండ్ల పేర్లు వినిపించేవి. పాత బ్రాండ్లు మచ్చుకైనా కనిపించేవి కావు. అందుకే ఏపీ మద్యం బ్రాండ్లు అంటేనే ఇతర రాష్ట్రాల వారికి ఒక రకమైన ఎగతాళి. ఏపీలో లభించే బూమ్ బూమ్ బీర్లు తాగడం వల్లే కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ చనిపోయారంటూ పుకార్లు షికార్లు చేశాయి. మరో నటుడు అయితే ఏపీ బీరు తాగి తాను చనిపోతానేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. మద్యం దుకాణాల వద్ద అయితే. ఇది జగన్ మద్యం అంటూ మందుబాబులు తిట్ల దండకం అందుకుంటారు. అయితే ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్లాయో లేదో కానీ.. ఇప్పుడు ఉన్నఫలంగా పాత మద్యం బ్రాండ్లు దుకాణాల్లో దర్శనమిస్తుండడం విశేషం.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చింది. ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసింది. ప్రభుత్వమే నేరుగా దుకాణాలు నడుపుతోంది. ఏడాదికి 25 శాతం షాపులను తగ్గించి.. నాలుగు సంవత్సరాల్లో మద్య నిషేధం వైపు అడుగులు వేస్తానని జగన్ ప్రకటించారు. అయితే ఆయన పాలన నెల రోజుల్లో ముగినుంది. షాపులు మాత్రం తగ్గలేదు. నవరత్నాల్లో భాగంగా మద్య నిషేధానికి హామీ ఇచ్చారు. నాసిరకం బ్రాండ్లను తెప్పించారు. ధరను అమాంతం పెంచేశారు. ధర ఎందుకు పెంచారని అడిగితే… మందుబాబులు తాగడం మానేస్తారని అంటూ వింత సమాధానాలు చెప్పారు. అయితే నాసిరకం మద్యం సరఫరాతో ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని జగన్ సర్కార్ భావించింది. పాత బ్రాండ్లను తిరిగి పునరుద్ధరించింది. ఇప్పటికే చాలా షాపులకు పాత మద్యం సరఫరా అవుతుంది. ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో పాత మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి.

బూమ్ బూమ్ బీర్లు, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్ వంటి ఎప్పుడూ వినని మద్యం బ్రాండ్లు కనిపించేవి. పాత బ్రాండ్ల జాడే లేకుండా పోయేది. అయితే ప్రస్తుతం బార్లు, మద్యం దుకాణాల్లో పాత బ్రాండ్ల విక్రయాలు మొదలయ్యాయి. ఈ బ్రాండ్లు అందుబాటులోకి రావడంతో వ్యాపారం పెరుగుతుందని బార్ల యజమానులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున రూ.75 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతుండగా.. పాత బ్రాండ్లు అందుబాటులోకి రావడంతో ఐదు నుంచి పది కోట్లకు వ్యాపారం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా మద్యం బ్రాండ్లపై విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. కానీ జగన్ సర్కార్ పట్టించుకున్న దాఖలాలు లేవు. నాసిరకం మద్యం అధిక ధరతో పాటు అనారోగ్యాలకు కారణమని తెలుస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. దీంతో ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. దీంతో పాత బ్రాండ్లను అందుబాటులోకి తేవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.