KCR Health: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరోగ్యం నిలకడగా ఉందని సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ కాలుజారి పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఉదయం ఎక్స్‌రే తీసిన వైద్యులు మడమ బాగంలో ఫ్యాక్చర్ అయినట్లు తెలిపారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. కేసీఆర్‌ను చూసిన ఆస్పత్రి సిబ్బంది, రోగుల బంధువులు కూడా కేసీఆర్ బాగానే ఉన్నారని, నొప్పితో బాధపడుతున్నారని వెల్లడించారు.
మధ్యాహ్నం హెల్త్ బులిటెన్..
ఇక మధ్యాహ్నం యశోద ఆస్పత్రి వైద్యులు కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇందులో కేసీఆర్ కాలుకు మల్టిపుల్ ఫ్యాక్చర్స్ అయినట్లు వెల్లడించారు. ఆయన హిప్ మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈమేరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి సర్జరీకి అవసరమైన పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు.
సీఎం రేవంత్ ఆరా..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. ‘తుంటి ఎముక విరిగి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశాను. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించాను. మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించాను. పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని తెలిపాను. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.
ప్రధాని ట్వీట్..
ఇక కేసీఆర్ జారిపడిన సమాచారం తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోదీ కూడా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఆస్పత్రికి రావొద్దు..
కేసీఆర్ జారిపడిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కేసీఆర్ కూతురు కవిత యశోదా ఆస్పత్రికి వచ్చారు. కేసీఆర్‌ను పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడారు. కేసీఆర్‌కు సాయంత్రం సర్జరీ జరుగనుందని, ఎవరూ పరామర్శకు ఆస్పత్రికి రావొద్దని హరీశ్‌రావు కోరారు.