
RRR – BRS – BJP: భారతీయ సినీ ప్రేమికులకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు ‘ఆర్‌ఆర్‌ఆర్’ తీసుకొచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు…’ సాంగ్ నాటు కొట్టుడు కొట్టి అవార్డును సొంతం చేసుకుంది. భారతీయ సినీ చరిత్రలో ఇదొక మరపురాని ఘట్టం.. సువర్ణాక్షరాలతో లిఖించదగిన పర్వం.. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ‘ఆస్కార్’ అవార్డు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సాకారం చేసింది. అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ ‘నాటు నాటు…’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. ఆస్కార్ కల నెరవేరడంతో యావత్ భారతావని సంబురాలు చేసుకుంటోంది.
తెలుగు సినిమాగానే చూస్తున్న తెలంగాణ మంత్రులు..
భారతీయ సినిమా కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆస్కార్‌కు నామినేట్ అయింది. ప్యాన్ ఇండియా సినిమాగా దీనిని రాజమౌళి తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. తెలుగు దర్శకుడు, తెలుగు హీరోలు, తెలుగు రచయిత, తెలుగు సింగర్స్ ఈ సినిమాకు పనిచేశారు. ఆస్కార్ వేదికపై తెలుగు పాట నాటు కొట్టుడు కొట్టింది. అయితే తెలుగు టెక్నీషియన్స్ రూపొందించిన చిత్రం.. విశ్వవేదికపై మెరవడం నిజంగా మనం గర్వించదగిన చిత్రం. అయితే తెలంగాణ మంత్రులు మాత్రం ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను ఇంకా తెలుగు సినిమాగా మాత్రమే చేస్తున్నారు. భారతీయ సినిమాగా చూడలేకపోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆర్‌ఆర్‌ఆర్‌కు అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ తెలుగు సినిమాకు అవార్డు రావడం గర్వకారణమన్నారు.
అడ్డకునేందుకు గుజరాత్ కుట్ర అంటూ విమర్శలు..
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రాకుండా బీజేపీ కుట్ర చేసిందని ఈ సందర్భంగా మంత్రుల మాట్లాడారు. ఆర్‌ఆర్‌ఆర్ ఆస్కార్‌కు నామినేట్ అయిన వెంటనే బీజేపీ నేతలు గుజరాత్ సినిమా ఛల్లోను ఆస్కార్‌కు నామినేషన్ చేయించి తెలుగు సినిమా అవకాశాలను దెబ్బ తీయాలని చూశారని ఆరోపించారు. ఒకవైపు కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని వ్యూహాలు రచిస్తున్నారు. కానీ, తెలంగాణ మంత్రులు మాత్రం తమది ఇంకా ప్రాంతీయ పార్టీ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ను తెలుగు సినిమాగానే చూస్తున్నట్లు వారి మాటలను బట్టి అర్థమవుతోంది.
బీఆర్‌ఎస్‌పై ప్రభావం..
ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్ అవార్డు రావడంపై భారతీయ సిని అభిమానులంతా గర్వంగా భావిస్తుంటే.. తెలంగాణ మంత్రులు ఇంకా ప్రాంతీయ నేతల్లా మాట్లాడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్, తెలంగాణ అంటూ విడదీసి మాట్లాడడం, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అంటూ విమర్శలు చేయడం ద్వారా పరోక్షంగా బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగించారని రాజకీయ విశ్లేషకులు, సినీ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. టెక్నీషియన్స్ తెలుగువారు అని గర్వంగా చెప్పుకుంటూనే భారతీయ సినిమా అని గొప్పగా యావత్ భారతం ఆస్కార్ ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. మరి బీఆర్‌ఎస్ మంత్రులు ఇంకా బావిలో కప్పల్లా, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ నేతల్లా మాట్లాడడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇలా అయితే బీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా ఎప్పటికి గుర్తింపు పొందుతుందో మరి!